మరో విద్యార్థి ఆత్మహత్య

Mar 21,2024 19:38

పార్వతీపురం రూరల్‌: చదువులో వెనుకబడిపోయామన్న ఆత్మన్యూణ్యతా భావంతో బుధవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న బిటెక్‌ విద్యార్థి కొల్లూరు తారకేశ్వరరావు (16) సంఘటన మరువక ముందే పార్వతీపురంలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పట్టణంలోని 24వ వార్డు కోడిగుడ్ల వీధికి చెందిన నాడెం ఈశ్వరరావు, జగదీశ్వరి కుమారుడు నాడెం సురేష్‌ పార్వతీపురం పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల జరిగిన పరీక్షల్లో అనుకున్న విధంగా రాయలేదనే మనస్తాపంతో తరచూ తల్లితండ్రుల దగ్గర బాధపడుతూ ఉండేవాడు. గురువారం మధ్యాహ్నం పాల వ్యాపారం చేస్తున్న తన తల్లిదండ్రులు బయటకు వెళ్లగానే తన ఇంట్లోనే ఫ్యాన్‌ రాడ్డుకు చున్నీ బిగించుకుని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు తలుపులు తీసేసరికి రాడ్డుకు వేలాడుతూ విగతజీవిలా ఉన్న కుమారుడ్ని చూసి హతాసులయ్యారు. పోలీసుల ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్‌ఐ సంతోషి కుమారి ఘటనపై వివరాలు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. తండ్రి పాల వ్యాపారం చేస్తుండగా, తల్లి ప్రయివేట్‌ పాఠశాలల్లో హిందీ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడు ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరై రోధిస్తున్నారు.

➡️