మిల్లర్ల వైఖరిపై రైతుల నిరసన

Dec 4,2023 21:11

పార్వతీపురంరూరల్‌:  ధాన్యం కొనుగోలులో మిల్లర్లు అనుసరిస్తున్న వైఖరి పట్ల రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎట్లకేలకు అధికారులు చొరవ తీసుకుని కొనుగోళ్లు కేంద్రాలను ప్రారంభించగా, రైతులు లారీలతో లోడ్‌చేసి పంపిన ధాన్యాన్ని మిల్లర్లు దిగుమతి చేసుకోనేందుకు నిరాకరించడం, బస్తాకు 10 నుండి 14కేజీలు తేమశాతం పేరిట డిమాండ్‌ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం పార్వతీపురం మండలం ఆడ్డాపుశిల, బంటువాని వలస రైతులకు చెందిన ధాన్యం పార్వతీపురం మండలం, నర్సిపురంలోని వెంకటపద్మ మోడరన్‌ రైస్‌ మిల్లుకు, పట్టణంలోని రాయగడరోడ్‌ శివారులో ఉన్న వెంకటేశ్వర మోడరన్‌ రైస్‌ మిల్లుకు 4 లారీలతో తరలించగా, ధాన్యం తేమశాతం ఎక్కువ ఉన్నందున తాము ససేమిరా దిగుమతి చేసుకోమని, లోడ్‌ను దించాలంటే బస్తాకు రూ.5 కూలీతో బస్తాకు 14 కేజీలు తరుగు ఇవ్వాలని డిమాండ్‌ చేసి ఉదయం 11గంటలకు వెళ్లిన లారీలను సాయంత్రం వరకూ నిలుదల చేయడంతో లారీ సిబ్బంది గగ్గోలు పెట్టారు. విషయం తెలుసుకున్న ఎపి రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆధ్వర్యంలో మిల్లుకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. సమస్యను పరిష్కరించడానికి రెవెన్యూ అధికారులు ఇచ్చిన టోల్‌ఫ్రీ నెంబరుకు చేయగా, అది పనిచేయకపోవ డంతో బంటుదాసు నేరుగా జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావుకు సమస్యను వివరించారు. మిల్లర్ల పేర్లు నమోదు చేసుకుని, సిబ్బందిని పంపి తక్షణమే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

➡️