ముడుపుల మత్తులో అధికారులు

Feb 5,2024 21:04

సాలూరు : ముడుపుల మత్తులో పడిన అధికారులు మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలకు అడ్డుగోలుగా అనుమతులు మంజూరు చేస్తున్నారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా అధికారులు కళ్లు మూసుకుని ఓకే చెపుతున్నారు. పట్టణంలో అనేక చోట్ల ఇరుకు సందుల్లో అపార్ట్‌మెంట్లు, గ్రూపు హౌస్‌ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అధికారులకు ముడుపులు చెల్లిస్తే చాలు ఎన్ని ఉల్లంఘనలున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రూపు హౌస్‌లు గానీ, అపార్ట్‌ మెంట్లు గాని నిర్మిస్తే వాహనాల రాకపోకలకు వీలుగా రహదారి సౌకర్యం వుండాలి. అగ్ని ప్రమాదాలు, ఇతర ప్రమాదాలేమైనా జరిగితే అగ్నిమాపక వాహనం రాకపోకల కోసమైనా అనువైన రహదారి సౌకర్యం ఉండాలి. కానీ అలాంటి నిబంధనలేవీ పాటించకుండా నిర్మాణాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. పట్టణంలోని పత్తివీధిలో ఇరుకు సందులో గ్రూపు హౌస్‌ నిర్మాణానికి అధికారులు అనుమతి ఇచ్చారు. మున్సిపల్‌ రోడ్డు మీదకు వచ్చి భవన యజమాని నిర్మాణాన్ని చేపట్టారు. అంతేకాక గ్రూపు హౌస్‌ ముందున్న విద్యుత్‌ స్తంభం వాలిపోయే లా చేసి భవన నిర్మాణం చేశారు. ఆ విద్యుత్‌ స్తంభానికి చుట్టు పక్కల ఉన్న ఇళ్ల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇటీవల గ్రూపు హౌస్‌కు విద్యుత్‌ సరఫరా చేయడానికి స్థానిక విద్యుత్‌ శాఖ సిబ్బంది ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వీధిలో ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. గంటల తరబడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో చుట్టూ ఉన్న నివాసితులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేపట్టారు. విద్యుత్‌ అధికారులు అక్రమ నిర్మాణాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించేందుకు గృహ వినియోగదారులకు సరఫరా నిలిపివేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యుత్‌ అధికారులు కూడా లంచాలు తీసుకుని అడ్డగోలుగా కనెక్షన్లు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇళ్ల పేరిట వ్యాపార సముదాయాలు పట్టణంలో చాలా చోట్ల ఇళ్ల నిర్మాణం పేరుతో కొంతమంది వ్యాపారులు వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నారు. కొంకివీధిలో ఇలాంటి నిర్మాణానికి అధికారులు అనుమతి మంజూరు చేయడం చర్చనీయాంశమైంది. ఈ నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా జరిగినా అధికారులు కనీసం యాజమానికి నోటీసులు కూడా జారీ చేయలేదు. ముడుపుల మత్తులో జోగుతున్న టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు నిబంధనల ఉల్లంఘనలను సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని ఉల్లంఘనలు వుంటే అంత ఎక్కువగా డబ్బులు గుంజుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

➡️