మున్సిపల్‌ వర్కర్లకు మద్దతుగా బైక్‌ ర్యాలీ

Dec 25,2023 21:36

పాలకొండ : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు మంగళవారం నుంచి చేపడుతున్న నిరవధిక సమ్మెకు పాలకొండ పట్టణంలో ప్రజలు మద్దతు ఇవ్వాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ పాలకొండ పట్టణ కమిటీ సిఐటియు ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ జరిగింది. ఈ మేరకు సోమవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం నుంచి మెయిన్‌ రోడ్డు మీదుగా పట్టణంలో పలు వీధుల గుండా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు మాట్లాడుతూ పాదయాత్రలో, అసెంబ్లీ సాక్షిగా జగనన్న ఇచ్చిన హామీల్లో పర్మినెంట్‌ చేస్తామన్న హామీని అమలు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన జీతం ఇవ్వాలని, ఇంజనీరింగ్‌ కార్మికులకు రిస్క్‌ అలవెన్స్‌ ఇవ్వాలని, చనిపోయిన వారికి రూ.2లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 26 నుండి జరగనున్న సమ్మెకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ పాలకొండ నగర పంచాయతీ ప్రతినిధులు ఎన్ని హరిబాబు, సిహెచ్‌ సంజీవి, పడాల వేణు, సిహెచ్‌.సురేష్‌, టి.ఈశ్వర కుమార్‌, పి.సూరిబాబు, కె.రాజేష్‌, పి.రమేష్‌, బాబురావు, సిఐటియు మండల కార్యదర్శి రాము తదితరులు పాల్గొన్నారు.

➡️