రేడియాలజిస్టు లేక అవస్థలు

Dec 11,2023 20:35

పాలకొండ: పేదలకు మెరుగైన వైద్యసేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్న పాలకులు, అధికారులు ఆచరణలో అంతా శూన్యమేనన్న వాస్తవాలు సర్కారు దావాఖానాల్లో దర్శనమిస్తున్నాయి. ప్రజలకు వద్దకు వైద్యసేవలని చెబుతున్న పాలకులు ప్రభుత్వ వైద్యశాలల్లో కనీస సౌకర్యాలు ఉన్నాయో లేదానని గమనించకపోవడం విడ్డూరం. పేరుకే పెద్దాసుపత్రులు తప్ప అక్కడ సేవలు మాత్రం సున్నా అన్నందుకు నిదర్శనం స్థానిక ఏరియా ఆసుపత్రే.స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పేరుకు వంద పడకల ఆసుపత్రి అయినప్పటికీ సమస్యలు మాత్రం కోకొల్లలు. ఏజెన్సీకి ముఖద్వారం దగ్గరున్న ఆసుపత్రికి నిత్యం రోగులు అధిక సంఖ్యలో వచ్చీపోతున్నారు. ఈ ఆసుపత్రికి పాలకొండతో పాటు విజయనగరం జిల్లా నుంచి రేగిడి, శ్రీకాకుళం జిల్లా నుంచి బూర్జతో పాటు సీతంపేట, భామిని, వీరఘట్టం, కొత్తూరు మండలాలకు చెందిన రోగులు ఇక్కడికి అధిక సంఖ్యలు వస్తున్నారు. ఆ ఆసుపత్రికి రోజుకు సుమారు 200 నుండి 250 వరకు అవుట్‌ పేషంట్లు రాగా, ఇన్‌ పేషంట్లు 50 నుంచి వంద మంది వరకు ఉంటున్నారు. ముఖ్యంగా గర్భిణులతో పాటు జనరల్‌ ఆపరేషన్లకు సంబంధించి రోగులు ఇక్కడకు ఎక్కువ మంది వస్తున్నారు. అయితే ప్రతి ఆపరేషన్‌కు, ఇతర రోగాలను గుర్తించేందుకు ప్రధామైంది స్కానింగ్‌. అయితే ఇందుకు సంబంధించిన రేడియాలజిస్టు లేకపోవడంతో స్కానింగ్‌ కోసం ప్రైవేటు ల్యాబ్‌లకు పరుగులు తీస్తున్నారు. ఇక్కడ పరికరాలున్నప్పటికీ సంబంధిత వైద్యులు కొద్ది రోజులుగా లేరు. గతంలో పని చేసిన వైద్యులు రాజేష్‌ రాజీనామా చేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇక్కడ రేడియాలజిస్టు లేకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పటం లేదు. ఇప్పటికైనా రెగ్యులర్‌ రేడియాలజిస్టును నియమించాలని పలువురు కోరుతున్నారు.

➡️