వీడని ఉత్కంఠంటిడిపి టికెట్‌ పై అయోమయం

Mar 21,2024 19:34

పాలకొండ : పాలకొండ (ఎస్టీ నియోజకవర్గం) తెలుగుదేశం టికెట్‌పై ఇప్పటికీ ఉత్కంఠం వీడలేదు. దాదాపు పార్వతీపురం మన్యం జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు టికెట్లు ఖరారు చేసినప్పటికీ పాలకొండ టికెట్‌ విషయంలో మాత్రం పార్టీ అధినాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పార్టీ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌ నిమ్మక జయకృష్ణ మొదటి నుండి టికెట్‌ ఆశిస్తున్నారు. అయితే పార్టీ కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి తానే అని చెప్పుకున్నారు. రెండుసార్లు ఓటమి పాలైన జయకృష్ణపై ఈసారి సానుభూతి కూడా కనిపించింది. అయితే నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలుగా గుర్తింపు పొందిన సామంతుల దామోదరరావు, కండాపు వెంకటరమణ, వారాడ సుమంత్‌ నాయుడు జయకృష్ణకు వ్యతిరేకంగా ఉన్నారు. నాలుగున్నరేళ్లలో ఆ నేతలను కలుపుకుని వెళ్లే ప్రయత్నం జయకృష్ణ చేయలేదని ఆ పార్టీలో కొంతమంది చెప్తున్నారు. టికెట్‌ రేసులో పడాల భూదేవి, గేదెల రవి, తేజోవతితో పాటు మరికొంతమంది ఉన్నారు. అయితే నియోజకవర్గంలో పార్టీలో గ్రూపుల పోరు ఉండడంతో ఈ సీటు జనసేనకి కేటాయిస్తారని కొద్ది రోజులుగా చర్చ జరుగుతుంది. సీట్లు కేటాయింపులు భాగంలో పాలకొండ జనసేనకే కేటాయిస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరో పక్క అరకు ఎంపీ అభ్యర్థిగా బిజెపి నుంచి కొత్తపల్లి గీతకు టికెట్‌ కేటాయించడంతో పాలకొండ సీటు కూడా బిజెపికి కేటాయించాలని ఆ పార్టీ నాయకులు పట్టుపడుతున్నట్టు తెలుస్తోంది. టిడిపికి ఇక్కడ టికెట్‌ ఇవ్వకపోతే సీటు గెలవడం కష్టమని నియోజకవర్గంలో సైకిల్‌కు పట్టుందని టిడిపి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే టిడిపి, జనసేన, బిజెపి పొత్తులో సీటు ఎవరికి కేటాయిస్తారో, అభ్యర్థి ఎవరనేది వేచి చూడాల్సి ఉంది.

➡️