షోకాజ్‌ నోటీసులివ్వడం దుర్మార్గం

Jan 17,2024 21:26

ప్రజాశక్తి-సాలూరు : అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు ఆమోదించకుండా రాష్ట్ర ప్రభుత్వం తమ పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్‌ నోటీసులపై మండిపడింది. వెంటనే నోటీసులను ఉపసంహరించుకోవాలని సిడిపిఒలను డిమాండ్‌ చేసింది. జిల్లాలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన చేపట్టిన నిరవధిక సమ్మె 37వ రోజు బుధవారం కొనసాగింది. సాలూరు పట్టణంలో అంగన్వాడీల సమ్మె శిబిరం 37వ రోజు బుధవారం కొనసాగింది. శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ వి.ఇందిర అంగన్వాడీలకు మద్దతు తెలిపి, మాట్లాడారు. ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోందని, వాటికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇటీవల ఎస్మా చట్టంలో భాగంగా కార్యకర్తలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు ఎ.నారాయణమ్మ, శశికళ ఆధ్వర్యాన కార్యకర్తలు, హెల్పర్లు ఐసిడిఎస్‌ పిఒ బి.సత్యవతికి సమాధానాలు అందజేశారు. ప్రభుత్వం కవ్వింపు చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు తిరుపతమ్మ సుభద్ర సుజాత పాల్గొన్నారు.పార్వతీపురంరూరల్‌ : అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.సరళరాణి, గంట జ్యోతి ప్రాజెక్టు నాయకులు, సరళారాణి, అలివేలు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.ఇందిర, కోశాధికారి గొర్లి వెంకటరమణ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ నుండి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం షోకాజు నోటీసులు జారీచేసిన ఐసిడిఎస్‌ పిఒ శ్రీనివాసరావుకు సమాధానాలు ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చితే విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని వారంతా తెలిపారు. అంతేతప్ప బెదిరింపులకు తలొగ్గేది లేదని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం జిల్లా నాయకులు పాలక రంజిత్‌ కుమార్‌, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు కె.రాజేశ్వరి, బి.శాంతి, ఎం.గౌరీ, సరస్వతి, కవిత, నాగసులోచన పాల్గొన్నారు.సీతంపేట : సీతంపేట ఐటిడిఎ ఎదుట అంగన్వాడీల నిరవధిక సమ్మె శిబిరం 37వ రోజు కొనసాగింది. ప్రాజెక్టు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్‌ నోటీసుకు సమాధానాలు తెలిపారు. అంగన్వాడీ యూనియన్‌ ప్రాజెక్టు కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.పార్వతి, ఎ.దర్శమి, సిఐటియు అధ్యక్షులు సురేష్‌, కార్యదర్శి ఎం.కాంతారావు, అరుణకుమారి, ప్రియ, అంజలి పాల్గొన్నారు.బలిజిపేట : బలిజిపేటలోని ఐసిడిఎస్‌ పిఒ కార్యాలయం వద్ద అంగన్వాడీలు నిరసన తెలిపారు. అనంతరం షోకాజ్‌ నోటీసులకు అంగన్వాడీలు సమాధానమిచ్చారు. వీరికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మథరావు మద్దతు తెలిపారు. నాయకులు గవర వెంకటరమణ, దాలమ్మ, రామలక్ష్మి, సావిత్రి, సత్యవతి, తదితరులు పాల్గొన్నారు.కొమరాడ : మండల కేంద్రంలో నిరసన శిబిరం వద్ద అంగన్వాడీలు షోకాజు నోటీసులు పట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం సిడిపిఒ సుగుణకు సమాధానాలు రాసి అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్షులు సిహెచ్‌ గౌరమ్మ , ఉపాధ్యక్షులు సిరిక అనురాధ, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, గరుగుబిల్లి మండల సెక్టార్‌ లీడర్లు సిహెచ్‌ గౌరమ్మ, డి.పద్మావతి, ఎం.సావిత్రి, హైమావతి తదితరులు పాల్గొన్నారు.

➡️