సంధ్యారాణి × తేజోవతి

Dec 30,2023 21:07

సాలూరు : నియోజకవర్గ టిడిపి తెరపై కొత్త అభ్యర్థి పేరు కనిపిస్తోంది. ఇన్‌ఛార్జి జి.సంధ్యారాణికి పోటీగా మరో గిరిజన నాయకురాలు టిడిపి టిక్కెట్‌ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. శనివారం పార్టీ కార్యాలయం నుంచి అనేక మంది టిడిపి కార్యకర్తలు, అభిమానులకు ఐవిఆర్‌ఎస్‌ ద్వారా ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. సాలూరు అసెంబ్లీ అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందనే అభిప్రాయాన్ని సేకరించేందుకు ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్లు పార్టీ శ్రేణులు చెపుతున్నాయి. నియోజకవర్గ ఇన్‌ఛార్జి సంధ్యారాణి, తేజోవతిల్లో ఎవరైతే మంచిదనే కోణంలో అభిప్రాయాలను కోరడం నియోజకవర్గ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. ఇంతవరకు నియోజకవర్గ ఇన్చార్జి  సంధ్యారాణే రానున్న ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే చాపకింద నీరులా ఆమెను వ్యతిరేకించే గ్రూపు నాయకులు పార్టీకి కొత్త అభ్యర్ధుల పేర్లను సూచించారు. మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌ దేవ్‌ అనుచరులు సంధ్యారాణి అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకత్వం సంధ్యారాణికి ప్రత్యామ్నాయంగా ముగ్గురు కొత్త అభ్యర్థుల పేర్లను పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక రిటైర్డ్‌ పోస్టల్‌ ఉద్యోగి పేర్లు ఉన్నాయి. ఆ ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరైన మొజ్జూరు తేజోవతి పేరు తాజాగా ఐవిఆర్‌ఎస్‌ ద్వారా అభిప్రాయ సేకరణలో వినిపిస్తోంది. దీంతో పార్టీ శ్రేణుల్లో నవ్యోత్సాహం కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న టిడిపిలో తాజా అభిప్రాయ సేకరణ సరికొత్త రాజకీయ సమీకరణాలకు నాంది పలుకుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.ఎవరీ తేజోవతి?టిడిపి తెరపై వినిపిస్తున్న కొత్త అభ్యర్థి పేరు మొజ్జూరు తేజోవతి. ఈమె విజయనగరం జిల్లా వంగర మండలం అరసాడలో ఎంపిపి పాఠశాల హెచ్‌ఎంగా పని చేస్తున్నారు. ఆమె కొండదొర ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళ. నియోజకవర్గ టిడిపి టిక్కెట్‌ ఆశిస్తున్న తేజోవతి ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఆమె రాజీనామాను ఆమోదించినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లా టిడిపి రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న బొబ్బిలి రాజుల ఆశీస్సులు కూడా ఆమెకు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

➡️