సమస్యల వలయంలో గ్రామ సేవకులు

Jan 1,2024 20:46

కురుపాం: గ్రామాల్లో కొద్దిపాటి వేతనాలతో విఆర్‌ఎలు సమస్యల వలయంలో విధులు నిర్వహిస్తున్నారు. పార్ట్‌టైం పేరుతో ప్రభుత్వం వారిచే పూర్తికాలం పని చేయించుకుంటుంది. మరోవైపు ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవటంతో విధుల్లో ఉన్న వారిపై పని ఒత్తిడి పెరుగుతోంది. ప్రభుత్వం ఎప్పటికైనా తమ సేవలను గుర్తిస్తుందని ఎదురు చూసిన విఆర్‌ఎలకు నిరాశే మిగిలింది. ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గౌరవవేతనం బదులుగా కనీస వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని పూర్తిగా విస్మరించారు. కనీస వేతనాలు అమలు చేయకపోగా గత ప్రభుత్వం అమలు చేసిన డిఎ రికవరీ చేసి ప్రభుత్వం వారి పట్ల కఠిన వైఖరి అవలంభించింది. గత ప్రభుత్వం 2018లో విఆర్‌ఎలకు జీతాలు పెంచడంతో పాటు డిఎ కూడా మంజూరు చేసింది. గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలో తప్పు ఉందని, అందువల్ల అదనంగా వేతనం తీసుకున్నారని సాకుగా చూపుతూ డిఎను రికవరీ చేసింది. నాలుగున్నరేళ్లుగా వివిధ రూపాల్లో నిరసన తెలిపినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. ఈ నేపథ్యంలో జనవరి 5న చలో విజయవాడకు సిద్ధమవుతున్నారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు బుట్టదాఖలుఉమ్మడి జిల్లాలో 1280 మంది గ్రామ రెవెన్యూ సహాయకులు(విఆర్‌ఎ)లు పని చేస్తున్నారు. వీరికి ప్రభుత్వం కేవలం రూ.10,480 మాత్రమే వేతనం చెల్లిస్తోంది. గతేడాది డిఎ రికవరీలో భాగంగా మరుసటి నెల వేతనం విడుదల చేయాలంటే డిడిల రూపంలో రూ.2,600 ప్రతి నెలా చెల్లించారు. ఒక్కొక్కరి నుంచి రూ.13,500 ప్రభుత్వం వసూలు చేసింది. మరోవైపు పని ఒత్తిడి పెరుగుతోంది. ఇసుక, గ్రావెల్‌ అక్రమ రవాణాను అడ్డుకోవటంతో పాటు, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీ సర్వే పనుల్లోనూ కీలకంగా విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటలకు విధులకు హాజరైతే తిరిగి ఇంటికి చేరేసరికి రాత్రి 8 గంటలు దాటుతోందని విఆర్‌ఎలు వాపోతున్నారు. దీనికితోడు విధి నిర్వహణలోనూ అక్రమార్కులు తమను టార్గెట్‌ చేసి ఇబ్బందులకు గురి చేయటం పరిపాటిగా మారింది. విఆర్‌ఎలకు రక్షణ కల్పించడంతో పాటు, గౌరవ వేతనం బదులుగా కనీస వేతనం ఇస్తామని ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్రలో ప్రకటించారు. వైసిపి అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లలో ఈ హామీల అమలుకు నోచుకోలేదు. డిఎ రికవరీ చేయడం ప్రభుత్వ చిత్తశుద్ది లేమికి నిదర్శనంగా నిలుస్తోంది.ఇవీ విఆర్‌ఎ ల డిమాండ్లు :తెలంగాణలో ఇస్తున్నట్లుగా పే స్కేల్‌ చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. నామినీలుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్‌ విఆర్‌ఎలుగా నియమించాలని కోరుతున్నారు. ఖాళీగా ఉన్న విఆర్‌ఎ, వాచ్మెన్‌, అటెండర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, జిప్‌ డ్రైవర్‌ పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.500 డిఎను 2018 జూన్‌ నుంచి వేతనంతో కూడిన డిఎగా తక్షణమే చెల్లించాలని కోరుతున్నారు.చలో విజయవాడ విజయవంతం చేయాలిఆంధ్రప్రదేశ్‌ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పిలుపు నేపథ్యంలో జనవరి 5న నిర్వహించబోయే చలో విజయవాడ కార్యక్రమానికి విఆర్‌ఎల కదలిరావాలి. ఎన్నికల ముందు జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. మరోవైపు డిఎ సొమ్మును రికవరీ చేయడం గతంలో ఎన్నడూ లేదు. ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం.జి. ఈశ్వరరావు, మన్యం జిల్లా అధ్యక్షులు, విఆర్‌ఎ అసోసియేషన్‌.

➡️