శిథిలావస్థలో పాఠశాల

Jun 20,2024 21:30

కురుపాం : నిరుపేద గిరిజన విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలనే ప్రభుత్వ లక్ష్యంతో గిరిజన గ్రామాల్లో పక్కా భవనాలు ఏర్పాటు చేసి వారికి విద్యను అందిస్తున్న ప్రభుత్వ ఆశయం గొప్పదే అయినప్పటికీ పాలకుల నిర్లక్ష్యమో, అధికారుల పర్యవేక్షణ లోపమో తెలియదు కానీ ఆ భవనాలు సమస్యలకు నిలయంగా మారాయి. మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న గొటివాడ పంచాయతీ బల్లుకోట గిరిజన గ్రామంలో సుమారు మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. ఈ పాఠశాలలో ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు 23 మంది విద్యార్థులు చదువుతుండగా ఒకే గది విద్యను అభ్యసిస్తూ వరండాలో మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. వరండా, తరగతిగది శ్లాబ్‌లో పెచ్చులూడి పడిపోతున్నాయి. ఏ సమయంలో ఎక్కడ పెచ్చులు మీదపడతాయోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం శ్లాబ్‌ నుంచి నీరు కారుతూ తరగతి గదుల్లో నీళ్లు నిల్వ ఉండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా ‘ప్రజాశక్తి’తో గ్రామస్తులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం గురించి ప్రజా ప్రతినిధులకు, అధికారులకు విన్నవించామని, అయినా ఫలితం లేదని అన్నారు. దీంతో విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విద్యను అభ్యసించాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వంలో హయాంలోనైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి శిథిలావస్థలో ఉన్న భవనాన్ని తొలగించి నూతన భవనాన్ని నిర్మించాలని కోరుతున్నామన్నారు.

➡️