సంతృప్తికరంగా నాడు-నేడు పనులు : డిఇఒ

May 25,2024 20:41

పాలకొండ: స్థానిక వెంకంపేట వీధి ఎంపియుపి స్కూల్‌లో జరిగిన నాడు-నేడు రెండోవిడత పనులు సంతృప్తికరంగా ఉన్నాయని డిఇఒ జి.పగడాలమ్మ తెలిపారు. పట్టణంలోని వెంకంపేట వీధి ఎంపియుపి స్కూల్‌ను శనివారం ఆమె సందర్శించారు. ఇక్కడ జరిగిన నాడు-నేడు పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పాఠశాల ఉండడం సంతోషకరమైన విషయమన్నారు. విద్యాబోధనలు కూడా అదే స్థాయిలో జరగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం జి.పరాంకుశము నాయుడు రెండో విడత నాడు-నేడు ప్రగతిని వివరించారు. నిధులు సరిపోక పనులు కొన్ని మిగిలిన పోయాయని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆమె స్పందిస్తూ ఈ పనులు నిమిత్తం నిధులు కేటాయింపునకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆమెతోపాటు ఎంఇఒ-2 సోంబాబు ఉన్నారు.వీరఘట్టం : పాఠశాలల పున ప్రారంభానికి పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు డిఇఒ జి.పగడాలమ్మ తెలిపారు. మండలంలోని కంబరవలసలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చేపడుతున్న పనులను శనివారం ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మండలంలోని రెండో విడత కింద నాడు నేడు పనుల్లో భాగంగా 24 పాఠశాలల్లో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి పాఠశాలలో 10 కాంపెట్స్మెంట్స్‌ పనులను త్వరితగతిగా పూర్తి చేసేందుకు చొరవ చూపాలని ఎంఇఒ-2 ఆర్‌-ఆనందరావును ఆదేశించారు. పాఠశాలకు వచ్చే పిల్లలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రత్యేక బాధ్యత వహించాలన్నారు. అంతకు ముందు వీరఘట్టం జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పుస్తకాల స్టాక్‌ పాయింట్‌ను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. పాఠ్యపుస్తకాలు పంపిణీలో ఎటువంటి లోపాలు లేకుండా విద్యార్థులందరికీ విద్యా కానుక కింద పాఠ్యపుస్తకాలు అందేలా చూడాలన్నారు. డిఇఒ వెంట సిఆర్‌పిలు, ఎంఆర్‌సి సిబ్బంది ఉన్నారు.

➡️