ఎండిఎం కార్మికులను తొలగించడం అన్యాయం

Jun 14,2024 21:48

కొమరాడ : కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించడం అన్యాయమని సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కోటిపాం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వద్ద తొలగించిన మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సాంబమూర్తి మాట్లాడుతూగతేడాది డిసెంబర్‌లో ఒక్కరోజు అన్నం బాగా వండకపోతే ఆరు నెలల తర్వాత ఈరోజు కార్మికులను తొలగిస్తున్నామని చెప్పడం ఇదెక్కడ న్యాయమని ప్రశ్నించారు. కలెక్టర్‌, డిఇఒ, ఎంఇఒ తొలగించమన్నారని హెచ్‌ఎం చెప్పడం చూస్తే విడ్డూరంగా ఉందన్నారు. ఒకవేళ తప్పు జరిగితే పిల్లల తల్లిదండ్రులతోనైనా, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌, సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయకుండా ఎలా మధ్యలో కార్మికులను తొలగిస్తారని ప్రశ్నించారు. ఈ పాఠశాలలో 18ఏళ్లుగా కార్మికులు బి.సావిత్రమ్మ, డి.సీత, వై.గంగమ్మ మధ్యాహ్న భోజనం వండి వడ్డిస్తున్నారన్నారు. ఇలాంటి సందర్భంలో ఒక్కరోజు అన్నం బాగోలేదని పత్రికల్లో వార్త వచ్చిందని ఎంఇఒ, డిఇఒ విచారణ చేసి కలెక్టర్‌కు పంపారన్నారు. అయితే ఈ విచారణలో స్థానిక స్కూలు కమిటీ చైర్మన్‌, కమిటీ సభ్యులను, పిల్లల తల్లిదండ్రులను కనీసం సంప్రదించకుండా దర్యాప్తు ఎలా చేపట్టారని ప్రశ్నించారు. ఈ విషయమై వెంటనే కలెక్టర్‌, డిఇఒ స్పందించి విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్‌కమిటీ చైర్మన్‌, సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి వాస్తవాలు వెలికితీయాలని హెచ్‌ఎంకు వినతిని అందజేశారు. విచారణ చేయకపోతే కొత్తగా నియమించిన మధ్యాహ్నం భోజనం కార్మికులను అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఎ.ఉపేంద్ర, నాయకులు శంకరరావు, అప్పలనాయుడు, శ్రీనివాసరావు, రవికుమార్‌, శ్రావణ్‌ కుమార్‌ విద్యార్థుల తల్లిదండ్రులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️