మలాథియన్‌ స్ప్రేయింగ్‌ను పరిశీలించిన డిఎంఒ

Jun 5,2024 21:28

పార్వతీపురంరూరల్‌ : మండలంలోని చందలంగి, బట్టివలసలో దోమల నివారణ మందు పిచికారీ (ఐఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని జిల్లా మలేరియా అధికారి (డిఎఒ) డాక్టర్‌ టి.జగన్‌ మోహనరావు బుధవారం పరిశీలించారు. ప్రతి ఇంటికీ స్ప్రేయింగ్‌ సక్రమంగా చేపడుతున్నదీ, లేనిదీ స్వయంగా తనిఖీ చేశారు. దోమల మందు ఎసిఎం రసాయనం వినియోగించిన మోతాదు, గ్రామంలో ఇళ్ల సంఖ్య తదితర వివరాలపై ఆరా తీశారు. మార్కింగ్‌ వేసిన ఇళ్లకు స్ప్రే జరిగిన తీరును గమనించారు. అనంతరం డాక్టర్‌ జగన్మోహన్‌ మాట్లాడుతూ గత నెల 15 నుంచి మొదటి విడత స్ప్రేయింగ్‌ దోమల నివారణ చర్యలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా జరుగుతుందని, పార్వతీపురం మండలంలో 36 గ్రామాలకు గానూ ఇప్పటికి 26 గ్రామాల్లో స్ప్రేయింగ్‌ పూర్తయ్యిందని తెలిపారు. వీటితో పాటు డ్రైడే కార్యక్రమాలు, ఫీవర్‌ సర్వే, యాంటీ లార్వా ఆపరేషన్లు, శానిటేషన్‌ డ్రైవ్‌ మొదలగు దోమల నివారణ చర్యలను సంబంధిత శాఖల సమన్వయంతో ఎప్పటికప్పుడు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. జ్వరాలను సకాలంలో గుర్తించడంలో అలసత్వం వహిస్తే తగు చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్‌ జి.ధరణి, కార్యాలయ డెమో యోగీశ్వరరెడ్డి, ఇఒ వెంకటనాయుడు, సత్తిబాబు, సూపర్వైజర్లు శంకర్రావు, జయలక్ష్మి, ఎంటిఎస్‌ రామకష్ణ, వైద్య సిబ్బంది బంగారినాయుడు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️