ఉపాధిలో రెండు పూటల పని రద్దు చేయాలి

Jul 1,2024 21:00

పార్వతీపురం టౌన్‌ :  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పనిని పెట్టుకున్నాయని, అందులో భాగమే ఉపాధికూలీలపై పని భారమని వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు నాయకులు రెడ్డి వేణు, పి.రాము, జి.వెంకటరమణ అన్నారు. ఉపాధి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం స్థానిక సుందరయ్యభవనం నుండి కలెక్టరేట్‌ వరకూ ర్యాలీ చేపట్టారు. అనంతరం అక్కడ ధర్నా చేసి జాయింట్‌ కలక్టర్‌ శోభితకు వినతాపత్రాన్ని అందించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ జిల్లాలో పనిచేస్తున్న ఉపాధి కూలీలు గత మూడు నెలలుగా ఎండలో ఎండి రెండు పూటలా పనిచేస్తే ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క విధంగా సుమారు ఐదు వారాలుగా బిల్లులు బకాయిలు ప్రభుత్వం చెల్లించలేదని అన్నారు. గత ఆరు మాసాలుగా అటు వ్యవసాయ పనులు లేక ఇటు చేసిన ఉపాధి పనులకు కూలి రాక కూలీలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. వెంటనే ప్రభుత్వం కలుగజేసుకొని ఉపాధి కూలీల బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అలాగే రెండు పూటలా పనిచేయడం వల్ల కూలీలు రోజుకు రెండు వైపులా 10 కిలోమీటర్ల వరకు వరకు మండుటెండల్లో నడవాల్సి వస్తుందని, దీనివల్ల కూలీల ఆరోగ్యం ఇప్పటికే దెబ్బ తినే పరిస్థితి కనిపిస్తుందని అన్నారు. కావున రెండు పూటలా పనిని రద్దుచేసి ఒక్క పూట పనిఇవ్వాలని అలాగే యాంత్రీకరణ పెరగడం వల్ల వ్యవసాయంలో పని దినాలు భారీగా తగ్గినందున 200 రోజులు పని దినాలు కల్పించాలని, రోజు కూలి రూ.400 ఇవ్వాలని, పాత పద్ధతిలాగా మేట్లకు ప్రోత్సాహం రూ.5 ఇవ్వాలని, అలాగే పని చేసే చోట మౌలిక పరిస్థితులైన పారా, పలుగు, తట్ట నిర్వహణకు డబ్బులు వేయాలని, మజ్జిగ ,మంచినీరు కూలీలకు సరఫరా చేయాలని మెడికల్‌ కిట్లు ఇవ్వాలని, టెంట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్య వెంటనే పరిష్కరించకపోతే రాబోయే రోజులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బత్తిన మోహనరావు, రవికుమార్‌, ఉపాధి కూలీలు జి. సింహాచలం, హెచ్‌ పెంటయ్య, ఎస్‌. చంద్ర, జె. శివుడు, కె. బూసన, ఎస్‌. కోమల, కె. ఆది తదితరులు పాల్గొన్నారు.సీతానగరం : ఉపాధి హామీ వేతనదారుల సమస్యలు పరిష్కరించాలని స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద వేతనదారులు నిరసన తెలిపారు. అనంతరం ఎపిఒకు వినతాపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్డి ఈశ్వరరావు, సిహెచ్‌ కృష్ణ వేతనదారులనుద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో వేతనదారులు బి. నారాయస్వామి, సూర్య నారాయణ, రామారావు, మాలతి,గౌరమ్మ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. కురుపాం : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఉపాధి వేతనదారులతో కలిసి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగ నాయుడు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో బిజెపి శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్‌ రాజు ఉపాధిహామీ పని ఎత్తివేయాలని, ఉపాధి పనివల్ల గ్రామీణులు సోమరిపోతులుగా తయారవ్వడం సమంజసం కాదని అన్నారు. విష్ణు కుమార్‌ రాజు ఉపాధి కూలీలకు క్షమాపణ చెప్పి వెంటనే తమ మాటను వెనక్కి తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్‌ చేస్తున్నామన్నారు. అనంతరం ఎపిఒ పి.బావాజీ, సీనియర్‌ సహాయకులు కన్నంనాయుడుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, గిరిజన సంఘం నాయకులు ఎం.అడ్డమేశ్వరావు, బి.వెంకటరావు, రమేష్‌, భాస్కరరావు ,వేతనదరులు పాల్గొన్నారు. కొమరాడ : జాబ్‌ కార్డు కలిగిన ఉపాధి కూలీకి 200 రోజుల పని దినాలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం కమిటీ సభ్యులు రెడ్డి శివుని నాయుడు, సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి డిమాండ్‌ చేశారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపిడిఒ మల్లికార్జునరావుకు, ఎపిఒ బాలకృష్ణకు వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు ఉపేంద్ర, గులిపల్లి శ్రీరాములునాయుడు, ఎం.శంకర్రావు, కూలీలు ధర్మ, పోలినాయుడు, సింహాచలం, లక్ష్మి, పార్వతి, వెంకటరావు, సుబ్బారావు, సన్యాసిరావు, లక్ష్మణరావు పాల్గొన్నారు. గుమ్మలక్ష్మీపురం : ఉపాధి కూలీల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ ఎపిఒ శివరామకృష్ణకు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కోశాధికారి మండంగి రమణ, నాయకులు ఎం.సన్యాసిరావు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో పలువురు వేతనదారులు పాల్గొన్నారు. జియ్యమ్మవలస : ఉపాధి వేతనదారులకు పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి భూతాలు మోహన్‌ రావు, ఆదివాసీ, గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కూరంగి సీతారాం డిమాండ్‌ చేశారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిడిఒ శ్రీనివాసరావుకు వారు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రాయిల ప్రసాద్‌, సత్యం తదితరులు పాల్గొన్నారు.

➡️