ప్రతి సమస్యకు పరిష్కారం చూపాలి

Jul 1,2024 20:58

పార్వతీపురంరూరల్‌ : ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ అధికారులను అదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. కలెక్టర్‌తో పాటు ఐటిడిఎ పిఒ సి.విష్ణు చరణ్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ఎస్‌ శోబిక, డిఆర్‌ఒ జి.కేశవనాయుడుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పెన్షన్లు పంపిణీ వెంటనే పూర్తిచేయాలని ఎంపిడిఒలను ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు తెలిపిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపాలని కలెక్టర్‌ తెలిపారు. శానిటేషను, కాలువల్లో పూడికతీత పనులు సక్రమంగా చేపట్టాలన్నారు. వర్షాలు పడి కాలువల్లో నీరు చేరడం వల్ల తాగునీరు కలుషితమయ్యేందుకు అవకాశం ఉందని, కావున మంచి నీటి పైపులు తనిఖీ చేసి ఎక్కడైనా లీకులుంటే పైపులు మార్చాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి రోజూ చేతులు శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టాలని, చేతులు ఎలా శుభ్రపరచుకోవాలో పిల్లలకు వివరించాలని తెలిపారు. అనంతరం ఫిర్యాదు దారుల నుంచి ఆర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 121 అర్జీలు అందాయి. కార్యక్రమంలో అన్నిశాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

➡️