నియోజకవర్గ అభివృద్ధికి కృషి : జయకృష్ణ

Jun 14,2024 21:43

భామిని: నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను పరిష్కరించి అభివృద్ధికి కృషి చేస్తానని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. శుక్రవారం మండలానికి విచ్చేసిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని, అసెంబ్లీ నిబంధనలను భ్రష్టుపట్టించిన వైసిపికి ప్రజలు ఈ ఎన్నికల్లో గట్టిగుణపాఠం నేర్పారని తెలిపారు. గత ఐదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధి అస్సలు పట్టించుకోలేదని, దోచుకో, దాచుకో అన్న చందంగా పాలన సాగిందని విమర్శించారు. పంచాయతీ రాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌, ఐటిడిఎల్లో నిధులు లేకపోవడం ఎవరి నిర్లక్ష్యమని ప్రశ్నించారు. అసెంబ్లీ దృష్టికి ఈ అంశాలు తీసుకెళ్లి యుద్ధప్రాతిపదికన నిధులు సమీకరణ చేసి, సమస్యలు పరిష్కరానికి దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానన్నారు. వైద్యాధికారులు మలేరియా, డెంగీ ప్రబలకుండా చూడాలని, మలేరియా ఫ్రీ జోన్‌లోకి నియోజకవర్గం ఉండాలని సూచించామని తెలిపారు. గత టిడిపి ప్రభుత్వం హయాంలో నిధులు మంజూరు చేసి పనులు తలపెట్టిన జంపరకోట జలాశయం, భామిని కొండ లోయ గెడ్డ రిజర్వాయర్‌, లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు వైసిపి నిధులు విడుదల చేయకుండా, వాటిని మూలకు చేర్చాయని విమర్శించారు. నిలిచిన వాటిని తిరిగి ప్రారంభించి పూర్తి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. భామిని ప్రధాన రహదారి, బస్టాండ్‌ పనులపై దష్టి సారిస్తాన్నారు. తన విజయానికి నిరంతరం శ్రమించిన టిడిపి, జనసేన, బిజెపి కార్యకర్తలకు, నాయకులు, ప్రజలకు ధన్యవాదములు తెలిపారు. విలేకరుల సమావేశంలో టిడిపి సీనియర్‌ నాయకులు నిమ్మక పాండురంగ రావు, రవి నాయుడు, ఎం. జగదీశ్వరరావు, సర్పంచ్‌ లోపింటి రాజేష్‌,భూపతి ఆనందరావు, బిడ్డికి ప్రసాద్‌, కోరాడ రాజేష్‌, గురిబిల్లి లక్ష్మి పతి, జనసేన కో ఆర్డినేటర్‌ జానీ, మండలం అధ్యక్షులు రుంకు కిరణ్‌ ఉన్నారు.

➡️