పార్కింగ్‌ సౌకర్యం లేని పాలకొండ

May 25,2024 20:37

పాలకొండ: డివిజన్‌ కేంద్రమైన పాలకొండ పట్టణం విద్య, వ్యాపార, ఆరోగ్య పరంగా చుట్టుపక్కల అనేక మండలాలకు ప్రధాన ముఖద్వారంగా ఉందని చెప్పవచ్చు. దీంతో పాలకొండకు ప్రతిరోజూ రాకపోకలు చేసే వారి సంఖ్య వేలల్లోనే ఉంటుంది. పెరుగుతున్న పట్టణీకరణతో పాలకొండలో షాపులకు కూడా విపరీతమైన గిరాకీ పెరిగింది. షాపుల అద్దెలు కూడా ఆకాశానికి అంటుతుండడంతో రోడ్డు మీద వ్యాపారాలు చేసుకుంటున్నవారి సంఖ్య కూడా ఘననీయంగా పెరిగింది. దీంతో పట్టణంలో పోలీస్‌ స్టేషన్‌ నుంచి కార్గిల్‌ కూడలి వరకు, అలాగే ప్రధాన రహదారుల్లో రోడ్డుకు ఇరువైపులా తోపుడు బళ్లు వల్ల రోడ్డు కుదించుకుపోయి ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగింది. పాలకొండ పట్టణంలో శ్రీకాకుళం, పార్వతీపురం ప్రధాన రహదారితో పాటు దుర్గ గుడి వెనుక నుంచి లుంబూరు రహదారి, మార్కెట్‌ రహదారి, సీతంపేట రోడ్డు, వడమ కూడలి, గాంధీ బొమ్మ నుంచి పాత పట్టణంలోకి వచ్చే రహదారులు ఇలా కొన్ని ముఖ్యమైన రహదారులన్నీ కూడా ట్రాఫిక్‌ వల్ల సరైన పార్కింగ్‌ లేకపోవడంతో నిత్యం రద్దీగా ఉంటాయి. గతంలో పాలకొండలో ఆర్‌డిఒగా పని చేసిన సాలూరు వెంకటేశ్వరరావు అప్పట్లోనే పాలకొండ ట్రాఫిక్‌ను అంచనా వేసి అదే సమయంలో సిఐగా పని చేసిన విజయానంద్‌తో కలిసి పట్టణ రూపురేఖలు మార్చడానికి కృషి చేశారు. ఫలితంగా మెయిన్‌ రోడ్డులో ప్రధాన కాలువ మీద ఉన్న ఆక్రమణలు తొలగించి షాపుల ముందు పార్కింగ్‌ కోసం స్థలం గుర్తించి మార్కింగ్‌ చేశారు. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో ఒక స్థలం, నాగవంశపు వీధి జంక్షన్‌ లో ఒక స్థలం, ఆర్‌సిఎం పాఠశాల దగ్గర స్థలాలు గుర్తించి పార్కింగ్‌ కోసం కేటాయించారు. ప్రజలు కూడా ఖచ్చితంగా అక్కడే తమ వాహనాలు పార్కింగ్‌ చేసి తమ పనులకు వెళ్లేలా అవగాహన కూడా కల్పించారు. ఒకవేళ హద్దులు మీరితే జరిమానాలు కూడా విధిస్తూ ఒక కొలిక్కి తీసుకొచ్చారు. ఆ అధికారులు ఇద్దరూ బదిలీపై పాలకొండను విడిచిపెట్టిన తర్వాత పట్టణంలో ట్రాఫిక్‌ యధాస్థితికి వచ్చేసింది. కాలువలు, పార్కింగ్‌ ప్రదేశాలు ఆక్రమణలతో నిండిపోయాయి. ఫలితంగా పార్కింగ్‌ స్థలం అంటూ లేక ఎవరికి నచ్చిన విధంగా వారు తమ వాహనాలను రోడ్డుల మీదే పార్కింగ్‌ చేస్తున్నారు. దీంతో అంతంతమాత్రంగానే వెడల్పుగా ఉన్న రహదారులు మరింత కుదించుకుపో యాయి. దీంతో పట్టణంలో ట్రాఫిక్‌ రద్దీ విపరీతంగా పెరిగిపోయి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విద్య, ఆరోగ్య పరంగా చుట్టూ పక్కల ఉన్న బూర్జ, సంతకవిటి, రేగిడి, వీరఘట్టం, సీతంపేట, కొత్తూరు, భామిని తదితర మండలాల ప్రజలు ప్రధాన కేంద్రంగా ఉన్న పాలకొండకు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. వీరికి పాలకొండ మండల ప్రజలు అదనం. పాఠశాలలు, కళాశాలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు పట్టణంలో ఈ ట్రాఫిక్‌ చూసి తమ పిల్లలు క్షేమంగా ఇంటికి వచ్చేవరకు ఆందోళన చెందుతూనే ఉంటారని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు పట్టణాన్ని పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

➡️