విద్యార్థులు సీజనల్‌ వ్యాధులకు గురికాకూడదు

Jun 14,2024 21:49

సీతానగరం: వసతి గృహ విద్యార్థులు సీజనల్‌ వ్యాధులకు గురికాకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) డాక్టర్‌ టి.జగన్మోహనరావు సూచించారు. మండలంలోని జోగింపేటలో గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్‌లో గదులను పరిశీలించి దోమల నివారణ మందు ఏ మేరకు పిచికారీ చేశారో గమనించారు. హాస్టల్‌ పరిసరాలను సందర్శించి వాడుక నీరు, వర్షపు నీరు నిల్వ లేకుండా జాగ్రత్త పడాలన్నారు. సిక్‌ రూం నిర్వహణను తనిఖీ చేసి అక్కడ బెడ్‌లకు ఏర్పాటు చేసిన దోమ తెరలను పరిశీలించారు. సిక్‌ రిజిష్టర్‌లో విద్యార్థుల ఆరోగ్య సమస్యల వివరాలు స్పష్టంగా ఉండాలని, వారి ఆరోగ్యం పట్ల నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. అక్కడ సిక్‌ రూంలో ఉన్న విద్యార్థి ఆరోగ్యం పరిశీలించి వైద్య సిబ్బందిచే జ్వర నిర్దారణ పరీక్ష చేయించారు. హాస్టల్‌లో ప్రాథమికంగా అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. వైద్య, వసతి గృహ సిబ్బంది సమన్వయంతో ఉండి జ్వరాలు, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎఎంఒ సూర్యనారాయణ, ప్రిన్సిపల్‌ బి.ధర్మరాజు, సూపర్వైజర్లు జయగౌడ్‌, శర్మ, వైద్య సిబ్బంది చైతన్య, లావణ్య, చంద్రినాయుడు, వసతి గృహ సిబ్బంది మీనాకుమారి, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️