శ్రీవాణి ఓటమికి కారణాలివే..

Jun 5,2024 21:36

గుమ్మలక్ష్మీపురం : అనతి కాలంలోనే ఉన్నత పదవులకు వెళ్లిన మాజీఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, అదే స్థాయిలో పదవికి దూరం కావడంతో పాటు ఒక సామాన్య మహిళ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఇందుకు అనేక కారణాలు వినిపిస్తున్నప్పటికీ అందులో ఆమె వైఖరే ప్రధానమైనదని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. శత్రుచర్ల కుటుంబానికి చెందిన కోడలుగా గుర్తిస్తూ పుష్ప శ్రీవాణిని 2014, 2019లో రెండుసార్లు ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. డిప్యూటీ సీఎంగా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఈమె పాలనలో ప్రజా సంక్షేమం, అభివృద్ధిని పక్కన పెట్టి, కోట్ల కుమ్మరించుకోవడమే పనిగా పాలన సాగించారని నియోజకవర్గ ప్రజలు ఆరోపిస్తున్నారు. సమస్యలను చెప్పుకునేందుకు గిరిజన ప్రజలు చినమేరంగి కోటకు వెళ్తే గంటల తరబడి నిరీక్షించాలే తప్ప కోట బయటకు వచ్చేవారు కాదనే అపవాదం కూడా ఉంది. బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు తీర్మానాన్ని వ్యతిరేకించకపోవడం, జిఒ 3 రద్దయిన కనీసం స్పందించకపోవడం, సవర భాష వాలంటీర్ల సమస్యలను పట్టించుకోకపోవడం, ఉద్యోగ, ఉపాధి లేక గిరిజనులు వలసపోతున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నివారణా చర్యలు తీసుకోకపోవడం, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు మరణాలు జరుగుతున్న స్పందించకపోవడం, గత కొన్నేళ్లుగా నియోజకవర్గంలో అడవి ఏనుగుల సమస్య ఉన్నా పరిష్కరించక పోవడం, పూర్ణపాడు- లాబేసు వంతెన పూర్తి చేయకపో వడం, సాగు నీటి ప్రాజెక్టు లపై దృష్టి సారించక పోవడం ఇలా ఎన్నో సమస్య లను పట్టిం చుకో కుండా నిర్లక్ష్యంగా వ్యవహరిం చారని ప్రజల నుంచి ఎన్నో ఆరోపణలు వినిపిం చాయి. రెండుసార్లు గెలిపించిన నియోజకవర్గ ప్రజలు మూడోసారి కూడా గెలిపిస్తారనే అతివిశ్వాసం బెడిసి కొట్టింది.జియ్మమ్మవలస : ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆమె అనేక కీలక పదవులు చేపట్టిన తర్వాత తనను నమ్ముకున్న కార్యకర్తలను దూరం పెట్టారని, నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలపై ఎవరు ఏ సూచనలు, సలహాలు ఇచ్చినా వాటిని స్వీకరించరని, టిడిపిని వీడి వైసిపిలో చేరిన వారికి సైతం విలువ ఇవ్వడంలేదని, తమ వెంటే ఉంటున్న భజన పరులకు తప్ప ఇంకెవరినీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు కూడా లేకపోలేదు. అంతేకాక గ్రామాల్లో సరైన నాయకత్వం లేకుండా అంతా వాలంటీర్లను నమ్ముకోవడం కూడా వైసిపి ఓటమికి కారణమని అంటున్నారు. ఏది ఏమైనా గత ఎన్నికల్లో కురుపాం నియోజకవర్గంలోని వైసిపికి ఏదైతే 25వేల ఓట్ల పైచిలుక మెజారిటీతో గెలుపొందారో, అదే తరహాలో తెలుగుదేశం అభ్యర్థి తోయకు జగదీశ్వరి గెలుపొందారు. ఈ ఎన్నికతో చినమేరంగి కోట నుండి ఎమ్మెల్యే పదవి చేజారడం నమ్మలేని నిజమని నియోజకవర్గం ప్రజలు అంటున్నారు.

➡️