చిన్నపాటి వర్షానికి జలమయమైన మెయిన్‌రోడ్డు

May 24,2024 21:49

పార్వతీపురం టౌన్‌ : పట్టణంలో శుక్రవారం రాత్రి ఏడు గంటలకు కురిసిన చిన్నపాటి వర్షానికే ప్రధాన రహదారి జలమయమైంది. దీంతో ప్రధాన రహదారిపై రాకపోకలు సాగించే పాదచారులు, వాహన చోదకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ప్రభుత్వాలు, అధికారులు మారినా రోడ్డు పరిస్థితి మారడంలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. పార్వతీపురం జిల్లా కేంద్రమై రెండేళ్లయినా ఈ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం మెయిన్‌రోడ్డుకు ఇరువైపుల ఉన్న కాలువలను ఎత్తు చేయకపోవడం, పూడికలు తొలగించక పోవడంతో ఏమాత్రం చిన్నపాటి వర్షం కురిసినా ప్రధాన రహదారిపై పడే వరదనీరు కాలువల్లోకి ప్రవహించేందుకు అవకాశం లేక ప్రధాన రహదారిపై నిల్వ ఉండిపోతుందని స్థానికులు చెబుతున్నారు. అలాగే పట్టణంలోని అన్ని వార్డుల్లో ఉన్న కాలువల్లో పూడికలు తొలగించక పోవడం ప్రధాన కారణం అని స్థానికులు వాపోతున్నారు. ఈ సమస్యను పలుమార్లు పట్టణ ప్రజలు మున్సిపల్‌ అధికారుల దష్టికి తీసుకెళ్ళినప్పటికీ పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపక పోవడంతో ఈ సమస్య అలాగే ఉంది. రానున్న రోజుల్లో వర్షాలు ఎక్కువ కురిసే అవకాశం ఉన్నందున అధికారులు స్పందించి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

➡️