వైసిపి ప్రచారహోరు… ఇంకా తేలని కూటమి అభ్యర్థి

Apr 5,2024 21:44

పాలకొండ : ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. అయితే పది రోజుల క్రితమే వైసిపి అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే కళావతి పేరు ప్రకటించారు. కానీ కూటమి తరుపున ఇంతవరకూ అభ్యర్థిని ప్రకటించలేదు. మొదట్లో తెలుగుదేశం పార్టీకి టికెట్‌ కేటాయిస్తారని అంతా భావించారు. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణతో పాటు పడాల భూదేవి, మరి కొంతమంది టికెట్‌ ఆశించడం పార్టీలో గ్రూపులు ఎక్కువుండడంతో ఈ సీటు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తారని ప్రచారంలోకి వచ్చింది. దీంతో తెలుగుదేశం తరఫున టికెట్‌ ఆశించిన పడాల భూదేవి స్థానిక నాయకులతో కలిసి పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. అయితే కొద్ది రోజుల క్రితమే జయకృష్ణ పవన్‌ కల్యాణ్‌ సమక్షంలోనే జనసేన కండువా కప్పుకున్నారు. దీంతో జనసేన టికెట్‌ జయకృష్ణకు కేటాయిస్తారని వార్తలు వినిపించాయి. అయితే ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించక పోవడంతో ఇటు టిడిపి, అటు జనసేన కేడర్‌ డీలా పడుతుంది. వైసిపి అభ్యర్థి కళావతి ప్రచారం మొదలుపెట్టి గ్రామాల్లో తిరుగుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న అభ్యర్థి ప్రకటనలో ఎందుకు జాప్యం చేస్తున్నారో తెలియడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ వినిపిస్తుంది.మొదలైన అసంతృప్తిజనసేన టికెట్‌ కేటాయింపుపై ఆ పార్టీలో అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. పొత్తులో భాగంగా పాలకొండ సీటు జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం రావడంతో టిడిపిలో టికెట్‌ ఆశిస్తున్న వారంతా జనసేన వైపు తిరిగారు. మొన్నటి వరకు టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న నిమ్మక జయకృష్ణ జనసేన కండువా కప్పుకోగా, స్థానిక తెలుగుదేశం నాయకులు టికెట్‌ ఆశిస్తున్న పడాల భూదేవి కూడా పవన్‌ కల్యాణ్‌ను కలవడంతో టిడిపి టికెట్‌ రేసులో ఉన్న వారికే జనసేన టికెట్‌ వస్తుందని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. అయితే పార్టీలో కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకు బుధవారం మాజీ జెడ్పీటిసి సభ్యులు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త నిమ్మల నిబ్రహం కొండ వీధులో ప్రెస్‌-మీట్‌ ఏర్పాటు చేసి తమకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీలో జయకృష్ణకు టికెట్‌ ఇస్తే ఒక గ్రూపు చేయరని, భూదేవికి టికెట్‌ ఇస్తే మరో గ్రూపు వ్యతిరేకిస్తారని బహిరంగ చర్చ జరుగుతుంది. ఈ పరిస్థితిలో జనసేన వారిద్దరో ఎవరికి టికెట్‌ ఇచ్చినా ఇదే పరిస్థితి వస్తుందని అన్నారు.

➡️