ఖాళీ స్థలాలు కొత్త పరిశ్రమలకు కేటాయింపు : మంత్రి

Jun 17,2024 21:04

ప్రజాశక్తి-బొబ్బిలి : పరిశ్రమలకు స్థలాలు కేటాయించినప్పటికీ పనులు ప్రారంభం కాని పరిశ్రమల స్థలాలను రద్దు చేసి నూతన పరిశ్రమలకు కేటాయిస్తామని రాష్ట్ర సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమలశాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ చెప్పారు. సోమవారం తొలిసారి బొబ్బిలి వచ్చిన మంత్రి శ్రీనివాస్‌ కు ఎమ్మెల్యే బేబినాయన, మాజీ ఎమ్మెల్యే తెంటు రాజా, జనసేన నియోజకవర్గ ఇంచార్జి గిరడ అప్పలస్వామి, బిజెపి నియోజకవర్గ కన్వీనర్‌ మరిశర్ల రామారావునాయుడు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కూటమి నాయకులు, కార్యకర్తలు మంత్రి శ్రీనివాస్‌ కు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం దర్బార్‌ మహాల్లో మంత్రి శ్రీనివాస్‌ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో సమస్యలను తెలుసుకునేందుకు పర్యటిస్తున్నామని చెప్పారు. ప్రజలు, రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గ్రోత్‌ సెంటర్లో ఇథనాల్‌ పరిశ్రమకు భూమి కేటాయించినప్పటికి పరిశ్రమ పనులు ప్రారంభించలేదన్నారు. పనులు ప్రారంభం కానీ పరిశ్రమల స్థలాలను రద్దు చేసి నూతన పరిశ్రమలకు కేటాయిస్తామని చెప్పారు. గ్రోత్‌ సెంటర్‌లో మౌలిక సౌకర్యాలు కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. మూతపడిన చక్కెర పరిశ్రమలను తేరిపించేందు ప్రయత్నం చేస్తామన్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి సహకరించండి : బేబినాయన

బొబ్బిలి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ను ఎమ్మెల్యే బేబినాయన కోరారు. కోటకు వచ్చిన మంత్రి శ్రీనివాస్‌ కు నియోజకవర్గ సమస్యలను వివరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రోత్‌ సెంటర్‌ కు కారుచౌకగా భూములిచ్చిన 15 గ్రామాల రైతులకు సంపూర్ణంగా ఉద్యోగాలు లేవన్నారు. న్యాయబద్ధంగా రావాల్సిన ఉద్యోగాలు అడిగితే వైసిపి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిందన్నారు. గ్రోత్‌ సెంటర్లో బినామీ పేర్లతో ఉన్న భూములను రద్దు చేసి పరిశ్రమలు ఏర్పాటు చేసే పారిశ్రామిక వేత్తలకు భూములు కేటాయించాలని కోరారు. పారాది వంతెన వద్ద నిర్మించిన రోడ్డు వరదలకు కొట్టుకుపోతోందని, రూ.15లక్షల వరకు కేటాయిస్తే రోడ్డు బాగుచేసి రాకపోకలకు ఆటంకం లేకుండా చేయవచ్చునన్నారు. మూతపడిన చక్కెర పరిశ్రమలను తెరిపించాలని కోరారు.శివడవలస వద్ద లిఫ్ట్‌ ఏర్పాటు చేయాలి మండలంలోని శివడవలస వద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు చేయాలని సర్పంచ్‌ వెంగళ లక్ష్మి, టిడిపి నాయకులు వెంగళ నారాయణరావు, రైతులు.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే బేబినాయనకు వినతిపత్రం అందజేశారు. టిడిపి హయాంలో శివడవలస వద్ద అప్పటి మంత్రి సుజయకృష్ణ శంకుస్థాపన చేస్తే వైసిపి ప్రభుత్వ హయాంలో శిలాఫలకాన్ని ధ్వంసం చేసి, రాముడువలస వద్ద అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ శంకుస్థాపన చేశారని వివరించారు. శివడవలస పరిసర ప్రాంతాల్లో మెట్టు భూములు కావడంతో పంటలు పండక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జనసేన కార్యాలయానికి వెళ్లిన మంత్రి

బొబ్బిలి వచ్చిన మంత్రి శ్రీనివాస్‌ జనసేన కార్యాలయానికి వెళ్లారు. ఆయనకు జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరి, జనసైనికులు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు.

ఎమ్మెల్యేను కలిసిన మంత్రి

భోగాపురం : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం మాధవిని సోమవారం తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గం ఇంచార్జ్‌ కర్రోతు బంగార్రాజు, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు కంది చంద్రశేఖర రావు, తదితరులు పాల్గొన్నారు.

కొత్తవలస : లక్కవరపుకోటలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారిని మంత్రి శ్రీనివాస్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్లయపై చర్చించారు. జిందాల్‌ పరిశ్రమను తెరిపించాలని కోరుతూ కార్మికులు మంత్రికి వినతనివ్వగా ఆయన సానుకూలంగా స్పందించారు.

➡️