అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పుల్లారావు

Jun 25,2024 19:08

అన్ని గ్రామాలకూ సాధ్యమైనంత త్వరలో తాగునీరు
ప్రజాశక్తి – చిలకలూరిపేట :
నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికీ స్వచ్ఛమైన తాగునీటిని సాధ్యమైనంత త్వరలో అందిస్తామని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. పట్టణంలోని తన నివాసంలో ఆయన్ను పల్నాడు జిల్లా పంచాయతీరాజ్‌ ఈఈ, పంచాయతీరాజ్‌ డిప్యూటీ ఈఈ (పీఐయూ), ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు మంగళశారం కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జల్‌జీవన్‌ మిషన్‌ వంటి కేంద్రప్రభుత్వ పథకాలనూ సమన్వయం చేసుకుని ఇంటింటికీ కుళాయి కనెక్షన్ల ద్వారా రక్షితనీరు సరఫరా చేస్తామని చెప్పారు. పెండింగ్‌ పనులపై వివరాలడిగి నిలిచిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పాడైపోయిన, పాతబడిన తాగునీటి పైప్‌లైన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పగుళ్లు, అపరిశుభ్ర వాతావరణం ఉన్న ప్రదేశాల నుంచి వచ్చే పైపులైన్ల నిర్వహణలో అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. అనంతరం నియోజకవర్గంలోని జెడ్‌పి పాఠశాలల హెచ్‌ఎంలు, పోతవరం, నాదెండ్ల కస్తూర్బా గాంధీ విద్యాలయాల వసతిగృహాల సిబ్బంది ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
రైల్వేలైన్‌ అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తా
ప్రజల ఆకాంక్షాలను గౌరవిస్తూ వారి సమస్యల పరిష్కారానికి నిత్యం ప్రయత్నిస్తామని ఎమ్మెల్యే పుల్లారావు అన్నారు. చిలకలూరిపేట రైల్వే లైన్‌ సాధన సమితి కన్వీనర్‌ షేక్‌ సుభాని, సభ్యులు మల్లికార్జున్‌, నవీన్‌ తదితరులు పుల్లారావును కలిసి చిలకలూరిపేటకు రైల్వేలైన్‌ ఏర్పాటుకు గతంలో ఇచ్చిన హామీని గుర్తు చేశారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ చిలకలూరిపేటకు రైల్వేలైన్‌ అత్యవసరమని, సిఎం చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని అన్నారు. చిలకలూరిపేటకు రైల్వేలైన్‌ ఏర్పాటు వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయని, స్థానికంగా పరిశ్రమలకు ఎగుమతి, దిగుమతి సులభతరం అవుతుందని, వివిధ ప్రాంతాల నుంచి ఈ ప్రాంతంలో పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు రవాణా వ్యవస్థ మెరుగుపడే అవకాశం ఉందని అన్నారు. దీంతోపాటు కొండవీడు లాంటి పర్యటక కేంద్రం అభివృద్ధి చెందుతుందని, చిలకలూరిపేటకు రైల్వేలైన్‌ వల్ల ఈ ప్రాంతం అన్ని విధాలుగా పురోగమిస్తుందని చెప్పారు.

➡️