సైనిక కుటుంబాలకు అండగా ఉంటా: ముత్తుముల

ప్రజాశక్తి-గిద్దలూరు: పట్టణంలోని నంద్యాల రోడ్డులోని చీతిరాల కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని మాజీ సైనికులతో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి బుధవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే గిద్దలూరు నియోజకవర్గంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. దేశ రక్షణలో గిద్దలూరు నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో సైనికులు ఉండటం మన నియోజకవర్గానికే గర్వ కారణమన్నారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే మాజీ సైనికుల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటామని, ఈసీహెచ్‌ఎస్‌ వైద్యశాలకు, మిలిటరీ క్యాంటీన్‌కు ప్రభుత్వ స్థలం మంజూరు చేస్తామని అన్నారు. మాజీ సైనికులు, సైనిక కుటుంబాలు మే 13న జరిగే ఎన్నికల్లో గిద్దలూరు టిడిపి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులురెడ్డికి సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనిక ఉద్యోగుల సంఘం నాయకులు జిల్లా కన్వీనర్‌ ఎస్‌ వేణుగోపాల్‌, కోటారెడ్డి, కె నరసింహులు, సిహెచ్‌ లక్ష్మణబాబు, యోగేశ్వరరావు, ఏఆర్కే రెడ్డి, పసుపులేటి శ్రీనివాసరావు, లక్ష్మీ రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️