బిజెపి ఉమ్మడి అభ్యర్థులను ఓడించండి : డి.వి.కృష్ణా

Apr 15,2024 22:17

ప్రజాశక్తి – జగ్గయ్యపేట: బిజెపి పొత్తులను తొత్తులుగా చేస్తూ బిజెపి ఉమ్మడి అభ్యర్థులను ఓడించి, ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణా పిలుపునిచ్చారు. పట్టణంలోని డివిఆర్‌ నగర్‌లో సిపిఎం సుందరయ్య భవన్‌లో సోమవారం నియోజకవర్గస్థాయి సిపిఎం సభ్యులు సానుభూతిపరులతో సమావేశం నిర్వహించారు. వత్సవాయి మండల సిపిఎం కార్యదర్శి తమ్మినేని రమేష్‌ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా డివి కృష్ణా మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ జనదళ్‌ అకౌంట్‌లో రూ.15 లక్షలు వేస్తానని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని, నిత్యావసర వస్తువుల ధరలు, డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు తగ్గిస్తానని చెప్పి ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. ఇటీవల కాలంలో జరిగినటువంటి పెద్ద స్కాం అయినా ఎలక్ట్రోల్‌ బాండ్లను బయటపెట్టాలని సిపిఎం సుప్రీంకోర్టుకు సైతం వెళ్లిందని అయినప్పటికీ ఎస్‌బిఐ బ్యాంక్‌ కొంత సమయాన్ని కావాలని కోరినప్పటికీ మరల సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్‌బిఐ బ్యాంక్‌ ఎలక్ట్రోల్‌ బాండ్లను బయటపెట్టిందన్నారు. ఇటీవల బిజెపి విడుదల చేసిన మేనిఫెస్టో అబద్దాల మ్యానిఫెస్టోని తెలిపారు. దేశంలో అత్యంత ప్రమాదకరమైన రాజకీయ విధానాలతో వచ్చిన పార్టీ బిజెపి అన్నారు. మళ్ళీ మోడీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని, మతోన్మాద, మనువాద సిద్ధాంతాన్ని అమలు చేస్తుందన్నారు. మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ మా రాష్ట్రంలో ఇవి సర్వసాధారణమని మాట్లాడటం అత్యంత దారుణం అన్నారు. ఎన్‌డిఎ కూటమి అభ్యర్థులను ఓడించి, ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. రాజధానికి 32 వేల ఎకరాలు అవసరం లేదని, రాజధాని నిర్మాణానికి 2,200 ఎకరాలు చాలని ఆనాడే సిపిఎం చెప్పిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల పట్టణ కార్యదర్శి సోమోజు నాగమణి, సిపిఎం సీనియర్‌ నాయకులు చిరుమామిళ్ల హనుమంతరావు, సిపిఎం నాయకులు ధారా నాగేశ్వరరావు, కాకనబోయిన లింగారావు, కోటా కష్ణ, దంతాల వెంకటేశ్వర్లు, షేక్‌ గౌస్‌మియా తదితరులు పాల్గొన్నారు.

➡️