మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

Jun 24,2024 22:33

విజయవాడ : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మాదక ద్రవ్యాలపట్ల అప్రమత్తంగా ఉండాలని మాచవరం ఎస్‌ఐ ఎ.వి.శ్రీనివాస్‌ అన్నారు. మాచవరంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సివిఆర్‌ ప్రభుత్వ కళాశాలలో నవజీవన్‌ బాలభవన్‌ ఆధ్వర్యంలో కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ టీం సహకారంతో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగంపై వ్యతిరేక ప్రచార వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా వినూత్నంగా ‘డ్రగ్‌ ఫ్రీ సూపర్‌ హీరో’ సెల్ఫీ కాంటెస్ట్‌ విద్యార్థులతో నిర్వహించారు. విద్యార్థులందరూ నేను ‘డ్రగ్‌ ఫ్రీ సూపర్‌ హీరో’ అని ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎస్‌ఐ శ్రీనివాస్‌ మాట్లాడుతూ డ్రగ్స్‌ వినియోగం ప్రాణాంతకమన్నారు. నార్కోటిక్‌ డ్రగ్స్‌ ఎన్‌డిపిఎస్‌ చట్టం మాదకద్రవ్యాల నేరాలను చాలా తీవ్రంగా చూస్తుందని, జరిమానాలు కఠినంగా ఉంటాయని మాదకద్రవ్యాల నేరాల్లో శిక్ష, జరిమానా రెండు కూడా కఠినంగా ఉంటాయన్నారు. అనంతరం మాదక ద్రవ్యాల వినియోగంపై వ్యతిరేక ప్రచార భాగంగా డ్రగ్‌ ఫ్రీ సూపర్‌ హీరో సెల్ఫీ కాంటెస్ట్‌లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ విద్యార్థి స్థాయి నుండే అవగాహన కలిగి ఉండాలని, ప్రతిఒక్కరు విలువలతో ఉండాలని, కుటుంబ విలువలు, శారీరక, మానసిక ఆరోగ్యాల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని అడుగులు వేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని అన్నారు. అనంతరం నవజీవన్‌ బాల భవన్‌ ప్రోగ్రాం మేనేజర్‌ గోళ్ళమూడి శేఖర్‌బాబు మాట్లాడుతూ అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా భాగంగా ఈ నెల 24 నుండి 30వ తారీకు వరకు విజయవాడ, పరిసర ప్రాంతాల్లో ఈ కాంటెస్ట్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఈ కాంటెస్ట్‌లో విజేతకు రూ.5వేలు నగదు బహుమతి అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులతో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమములో కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.రమేష్‌, అధ్యాపకులు డాక్టర్‌ అశోక్‌, జి.విజయదీప్‌, నవజీవన్‌ బాల భవన్‌ జోనల్‌ కోఆర్డినేటర్స్‌, వాలంటీర్స్‌ పాల్గొన్నారు. భవానీపురం : విజయవాడ విద్యాధరపురంలోని ప్రభుత్వ జానియర్‌ కళాశాల (ఉర్దూ)లో నవజీవన్‌ బాల భవన్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగంపై వ్యతిరేక ప్రచార వారోత్సవాల్లో భాగంగా వినూత్నంగా ‘డ్రగ్‌ ఫ్రీ సూపర్‌ హీరో’ సెల్ఫీ కాంటెస్ట్‌ విద్యార్థులతో నిర్వహిచారు. నేను ”డ్రగ్‌ ఫ్రీ సూపర్‌ హీరో” అని విద్యార్థులు ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భవానీపురం పోలీస్‌ స్టేషన్‌ నుండి అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ టి.జయరాజు మాట్లాడారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్‌ హఫీజ్‌ షేక్‌ అహ్మద్‌, నవజీవన్‌ బాల భవన్‌ జోనల్‌ కోఆర్డినేటర్‌ కె ప్రియాంక మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విద్యాధరపురంలోని ప్రభుత్వ జానియర్‌ కళాశాల (ఉర్దూ) అధ్యాపకులు నవజీవన్‌ బాల భవన్‌ జోనల్‌ కోఆర్డినేటర్‌ ఎన్‌.దేవమణి, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️