అక్రమ వెంచర్లకు అడ్డా నందిగామ

May 18,2024 19:23
  • నందిగామలో ప్రభుత్వ భూమి కబ్జా –
  • మాముళ్ళ మత్తులో అధికారులు

నందిగామ పట్టణంలో ప్రభుత్వ భూమిని సైతం రియాల్టర్లు ఆక్రమించి ప్లాట్‌లుగా అమ్ముకుంటున్నారు. రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారు. నందిగామ పట్టణం అక్రమ వెంచర్లకు అడ్డాగా మారింది. ప్రభుత్వ భూమిని కూడా ప్లాట్లుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. నందిగామ నగర పంచాయతీ పరిధిలో చందాపురం రోడ్డులో ఫ్రెండ్స్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఎదురుగా ఎటువంటి మున్సిపల్‌, రెవెన్యూ అనుమతులు లేకుండా భారీగా అక్రమ లే అవుట్లు ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఈ లే అవుట్లలో ప్రభుత్వ భూమి సుమారు 90 సెంట్లు ఉన్నట్లు సమాచారం. అయినా ఆర్డిఓ, మున్సిపల్‌ అధికారులు, తహశీల్దార్‌ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. 817, 818 సర్వే నంబర్లో సుమారు 90 సెంట్లు ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకోవాలని పలువురు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా, గత తహశీల్దార్‌ దర్యాప్తు చేసి చర్యలు చేపట్టేలోగా ఆయన బదిలీ అయ్యారు. నగర పంచాయతీ పరిధిలో అనాసాగరం ఊరి చివర జాతీయ రహదారిని ఆనుకుని మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ భర్త (లేటు) ఎటువంటి మున్సిపల్‌, రెవెన్యూ అనుమతులు లేకుండా భారీ అక్రమ లే అవుట్‌ వేశారు. ఈ అక్రమ లే అవుట్‌పై మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కన్నెత్తైనా చూడరు. చందాపురం వాగును ఆనుకొని వాగుకు సంబంధించిన ముంపు ప్రాంతం అని చూడకుండా వాగు పోరంబోకును సైతం ఆక్రమించి లే అవుట్‌ వేశారు. అయినా అధికారులు పట్టించుకోవటం లేదు. దీనిపై నందిగామ ఆర్‌డిఒ రవీంద్రరావు, మున్సిపల్‌ కమిషనర్‌, తహశీల్దార్‌ సమగ్ర విచారణ చేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ లే అవుట్లపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేశారు.

➡️