గ్రీన్‌ బెల్ట్‌ కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలి

Jun 19,2024 22:00
  • – కాలుష్య నియంత్రణ పోరాట సమితి అధ్యక్షుడు సురేష్‌

ప్రజాశక్తి – ఇబ్రహీంపట్నం : డాక్టర్‌ ఎన్‌టిటిపిఎస్‌సి ఎస్‌ఆర్‌ నిధుల కింద రూ.4 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించిన సంగతి విధితమే. వీటిపై కాలుష్య నియంత్రణ పోరాట సమితి అధ్యక్షుడు చెరుకుమల్లి సురేష్‌ బుధవారం విటిపిఎస్‌ ఎదురుగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.24 కోట్ల పైచిలుకు రావలసిన నిధులలో కేవలం రూ.4 కోట్లు మంజూరు చేయడం తీవ్ర నిరాశ కలిగించిందని అన్నారు. అందులో గ్రీన్‌ బెల్ట్‌ కోసం కేవలం రూ.30 లక్షలు మాత్రమే కేటాయించారని వాటితో కేవలం 700 మొక్కలు మాత్రమే నాటగలుగుతామని అన్నారు. 10 గ్రామాల్లో 700 మొక్కలు ఏమాత్రం సమంజసమో అధికారులే చెప్పాలని ప్రశ్నించారు. పోరాట సమితి డిమాండ్లను పరిష్కరించడంలో ఎన్‌టిటిపిఎస్‌ యాజమాన్యం పూర్తిగా విఫలమైందని అన్నారు. కాలుష్య నియంత్రణ కొరకు ముఖ్యమైన చర్యల్లో గ్రీన్‌ బెల్ట్‌ కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అన్ని గ్రామాలకు సమానంగా నిధులు కేటాయించాలని కోరారు. మంజూరు చేసిన నిధులను వెంటనే విడుదల చేసి గ్రామాల అభివద్ధి పనులు ప్రారంభించాలని అన్నారు. ప్రస్తుతం మంజూరు చేసిన నిధులతో అతి ముఖ్యమైన తాగునీటి సమస్య పరిష్కరించాలని సూచించారు. బూడిద మీద ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. పూర్తి నిధులు వచ్చేవరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ సమావేశంలో పోరాట సమితి సభ్యులు షేక్‌ కరిముల్లా, మాధురి, రాజేంద్ర, భవానీ,అనీల్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️