రాష్ట్రస్థాయి అండర్‌ -17 చెస్‌ పోటీలు ప్రారంభం

Apr 20,2024 22:14

ప్రజాశక్తి – ఎడ్యుకేషన్‌ : పోరంకిలోని గ్రీన్‌ స్కూల్‌ నందు రాష్ట్ర స్థాయి అండర్‌ -17 చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను తొలుత ఆంధ్ర చెస్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ రామ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెస్‌ క్రీడ వల్ల విజ్ఞానంతో పాటు వికాసం పెరుగుతుందన్నారు. ప్రతి విద్యార్ధి ఏదో ఒక క్రీడలో నైపుణ్యాన్ని పెంపొందించు కోవాలన్నారు. గ్రీన్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ జె.సాయి అపర్ణ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలన్నారు. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వ పరంగా మంచి ప్రోత్సాహకాలు ఉన్నాయని అన్నారు. తమ పాఠశాలలో విద్యతో పాటు ఆటలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కృష్ణా జిల్లా చెస్‌ అసోసియేషన్‌ సెక్రటరీ ఎం. ఎం.ఫణి కుమార్‌ మాట్లాడుతూ కృష్ణా జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్‌ -17 చెస్‌ పోటీలకు మంచి స్పందన వస్తుందన్నారు. వివిధ ప్రాంతాల నుండి సుమారు 60 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు, నంద్యాల చీప్‌ కోచ్‌ ఇమామ్‌ హుస్సేన్‌, పలువురు కోచ్‌లు క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️