నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు

May 21,2024 20:31

ప్రజాశక్తి – నందిగామ : నందిగామలో పాత బస్టాండ్‌లో నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్‌మెంట్‌ నిర్మాణాలు జరుగుతున్న మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శలు వ్యక్తమయ్యాయి. టిబి రోడ్డులో మున్సిపాలిటీ కాలువపై 4 అడుగులు ఆక్రమించి షాపులు కట్టారు. మున్సిపాలిటీ కాలువపై బ్లాక్‌లు వేయకుండా ఏకంగా 20 అడుగుల స్లాబ్‌ వేసి కాలువ క్లోజ్‌ చేశారు. రేపు కాలువలో డ్రైనేజి సమస్య వస్తే అక్కడ ఎలా శుభ్రం చేయాలి. మునిసిపల్‌ కాలువపై వేసిన 20 అడుగుల స్లాబ్‌ కింద చెత్త పెరుకపోతే మురుగు అంత రోడ్డు పైకి వస్తే, ప్రజలు అనారోగ్యం బారిన పడితే, ఎవరు బాధ్యత తీసుకుంటారు, అది ఎవరి తప్పిదం అని స్థానికులు బాషా, పలువురు విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. టిబి రోడ్డు అంచుకి మెట్లు కట్టారు. దీనివల్ల రోడ్డుపై వచ్చే వాహనాలకు ప్రమాదాలు జరుగుతాయని ఆందోళన చెందుతున్నారు. టిబి రోడ్డు అంచుకు ఏకంగా ఫ్లోరింగ్‌ లాగారు. దీంతో వాహనాలు జారి ప్రమాదాలు జరగవచ్చు. ముఖ్యంగా అసలు బిల్డింగ్‌కి మున్సిపాలిటీ నిర్మాణం అనుమతులు లేవు. ఎటువంటి అనుమతులూ లేకుండా 4 స్లాబ్‌లు వేసిన మునిసిపల్‌ కమిషనర్‌, సిబ్బంది పట్టించుకోవటం లేదని ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలను అతిక్రమించి అక్రమ కట్టడాలు కడుతున్న మున్సిపల్‌ అధికారులు, సిబ్బందిని కూడా లెక్క చేయ కుండా, నిర్మాణ పనులు యథేచ్ఛగా జరుగుతు న్నాయంటే మర్మం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే నందిగామలో ఇంకెవరు మునిసిపల్‌ పర్మిషన్‌లు తీసుకోని, నిర్మాణాలు చేయరు. ఈ బిల్డింగ్‌ను సాకుగా చూపిస్తూ మున్సిపల్‌ అధికారులను ప్రశ్నించే రోజులు ముందు ముందు చూడవలసి ఉంటుంది. నందిగామ టిబి రోడ్డుపై నిత్యం రద్దీగా ఉండే రహదారిపై ఇప్పటి వరకు మునిపాలిటీ అధికారులు, సిబ్బంది ఎవ్వరు, ఎటువంటి చర్యలు లేవంటే ఇంత పెద్ద కట్టడం వెనక మర్మం ఏమిటో? త్వరలో ఆంధ్రప్రదేశ్‌ నుండి ఉన్నత అధికారులు వచ్చి విచారణ చేసి వారి ద్వారా చర్యలు తీసుకుంటే, అప్పుడు కేసులు బిల్డింగ్‌పై ఉంటాయో, లేక నందిగామ మునిసిపల్‌ అధికారులు, సిబ్బందిపై ఉంటాయో వేచి చూడాలని స్థానికులు చర్చించుకుంటున్నారు.

➡️