విద్యార్థులు ఉన్నతంగా ఆలోచించాలి

Apr 16,2024 22:03
  • విజయవాడ కెనరా బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌ పి.రవివర్మ

ప్రజాశక్తి – ఎడ్యుకేషన్‌ : విద్యార్థులు ఉన్నతమైన ఆలోచనలు చేస్తూ అవకాశాలను అందిపుచ్చుకోవాలని విజయవాడ కెనరా బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌ పి.రవివర్మ సూచించారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్దార్థ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలోని బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించిన మాగ్నోవా 2కె 24 మెగా ఈవెంట్‌లో రవివర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రవివర్మ మాట్లాడుతూ అభివృద్ధి అనేది హార్డ్‌వర్క్‌తోనే సాధ్యమవుతుందనే విషయాన్ని విద్యార్థులు గ్రహించాలన్నారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థ రాబోయే 25 ఏళ్ళలో తొమ్మిదింతలు పెరుగుతుందని గణాంకాలు చెబుతున్నాయన్నారు. ఈ క్రమంలో యువతకు ఉద్యోగ అకాశాలు అపారంగా ఉండబోతున్నాయన్నారు. వాటిని అందిపుచ్చుకోవాలంటే విద్యార్థులు ఇప్పటి నుంచే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మేకా రమేష్‌, కళాశాల డీన్‌ ప్రొఫెసర్‌ రాజేష్‌ సి జంపాల, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగాధిపతి కె.వి.రమేష్‌ చంద్ర మాట్లాడుతూ, మాగ్నోవా 2కె24 మెగా ఈవెంట్‌ పోటీల నిర్వహణ కారణంగా విద్యార్థుల ప్రతిభ మరింత ఇనుమడింజేసిందని పేర్కొన్నారు. ఈవెంట్‌లో మాస్టర్‌ మైండ్స్‌ (యంగ్‌ మేనేజర్‌), బిజ్‌బ్లాస్ట్‌(బిజినెస్‌ ప్లాన్‌), బిజినెస్‌ బ్రెయిన్‌ బాటిల్‌ (బి క్విజ్‌), మార్కెట్‌ మేకర్స్‌, మిస్టర్‌ అండ్‌ మిస్‌ మాగ్నోవా, ఐపీఎల్‌ ఆక్షన్‌, నెల్స్‌ రీల్‌ ఇట్‌(రీల్‌ మేకర్‌) వంటి 7 అంశాల్లో విద్యార్థుల మధ్య పోటీలు జరిగాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి 300కి పైగా విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటారని తెలిపారు. అనంతరం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో పోటీల్లో గెలుపొందిన విజేతలకు జ్ఞాపికలు, ధవీకరణ పత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మిస్టర్‌ అండ్‌ మిస్‌ మాగ్నోవాతో పాటు పీబీ సిద్ధార్థ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. రెట్టించిన ఉత్సాహంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ మాగ్నోవా ఈవెంట్‌లో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాగ్నోవా ఈవెంట్‌ ఆర్గనైజర్స్‌ కె.విజరు, కె.శ్రీనివాసులు, పి.కిషోర్‌, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.

➡️