భారతీయ కరెన్సీ నోట్లపై ముద్రించిన ప్రదేశాలను సందర్శించిన వరల్డ్‌ రికార్డు హోల్డర్లకు సత్కారం

May 2,2024 22:01

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : భారతీయ కరెన్సీ నోట్లపై ముద్రించబడిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలను కేవలం ఏడు రోజుల్లో 6,305 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి దర్శించి ప్రపంచ రికార్డు సృష్టించిన విజయవాడకు చెందిన షేక్‌ నయీమ్‌ పాషా, మోటపోతుల ఉదరు నాగభూషణం అభినందనీయులనీ శ్రీ గౌతమ్‌ విద్యాసంస్థల ప్రిన్సిపాల్‌ ఎన్‌ సూర్యారావు ప్రశంసించారు. గురువారం చిట్టినగర్‌ లోని శ్రీ గౌతమ్‌ విద్యాసంస్థల ప్రాంగణంలో నయీమ్‌ పాషా, ఉదరులను శాలువలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా సూర్యారావు, బిజెపి రాష్ట్ర నాయకులు బి.శివకుమార్‌ పట్నాయక్‌, గాంధీ దేశం సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ అధ్యక్షులు గాంధీ నాగరాజన్‌ మాట్లాడారు. నయీమ్‌ పాషా, ఉదరు మాట్లాడుతూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జారీ చేసిన భారతీయ కరెన్సీ నోట్లపై ముద్రించిన యునిస్కో భారతదేశ ప్రపంచ వారసత్వ ప్రదేశాలను సందర్శించాలన్న ఆకాంక్షతో తాము ఈ ఏడాది ఏప్రిల్‌ 19న ఆంధ్ర ప్రదేశ్‌ లోని గుంటూరు నుండి రైలులో తమ ప్రయాణాన్ని ప్రారంభించామని 7 రోజుల్లో మొత్తం 6305 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఆయా ప్రదేశాలను సందర్శించిన అనంతరం విజయవాడలో తమ యాత్రను ముగించామని చెప్పారు. భారతీయ కరెన్సీ 50 రూపాయల నోటుపై ముద్రించిన హంపిలోని రాతిరథం, 500 రూపాయలు నోటు మీద ఉన్న న్యూఢిల్లీలోని ఎర్రకోట, 100 రూపాయల నోటు మీద ఉన్న పటాన్‌లోని రాణికి వావ్‌, 20 రూపాయల నోటు మీద ఉన్న ఔరంగాబాద్‌లోని ఎల్లోరా గుహలు ,200 రూపాయల నోటు మీద ఉన్న భోపాల్‌ లోని సాంచి స్తూపం, 10రూపాయల నోటు మీద ఉన్న కోణార్క్‌లోని సన్‌ టెంపుల్‌ వంటి చారిత్రక ప్రదేశాలను తాము సందర్శించామన్నారు.

➡️