స్ట్రాంగ్‌ రూముల ఆకస్మిక తనిఖీ

May 18,2024 21:10
  • సిబ్బందికి పలు సూచనలు చేసిన పోలీస్‌ కమిషనర్‌ పి.హెచ్‌.డి.రామకృష్ణ
  • సిపి వెంట జాయింట్‌ కలెక్టర్‌ పి.సంపత్‌ కుమార్‌

ఎన్‌టిఆర్‌ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గం పోల్డ్‌ ఇ.వి.ఎం.బాక్స్‌లను భద్రపరిచేందుకు ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నిమ్రా, నోవా కళాశాలల్లో స్ట్రాంగ్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద కేంద్ర బలగాలు, ఆర్మ్‌డ్‌ రిజర్వు బలగాలు, సివిల్‌ పోలీస్‌ బలగాలతో మూడంచెల విధానంతో నలువైపులా పోలీస్‌ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. నిరంతరం సిసి కెమెరాల పర్యవేక్షణ, వాటిని 24 గంటలూ పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు. పారదర్శక, ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్‌ నిర్వహించేదుకు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం పోలీస్‌ కమిషనర్‌ పి.హెచ్‌.డి.రామకృష్ణ, జాయింట్‌ కలెక్టర్‌ పి.సంపత్‌ కుమార్‌, ఇతర అధికారులతో కలిసి నిమ్రా కళాశాల స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద బందోబస్త్‌ నిర్వహిస్తున్న సిబ్బందిని ఆకస్మికంగా తనిఖీ చేసి, అప్రమత్తం చేస్తూ స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద, కౌంటింగ్‌ ఏరియాలను, మెయిన్‌ గేటు నుండి స్ట్రాంగ్‌ రూమ్‌ల వరకు తిరిగే రూట్‌ మొబైల్స్‌ గురించి, పెట్రోలింగ్‌ పార్టీలను, గార్డ్స్‌ గురించి స్వయంగా పరిశీలించి అధికారులకు సిబ్బందికి తగు సూచనలు, సలహాలు అందించారు. కంట్రోల్‌ రూమ్‌లోని సి.సి.కెమెరాల పర్యవేక్షణ పనితీరును పరిశీలించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఇవిఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూముల వద్ద కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలకూ ఆస్కారం లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. జిల్లాలోని పోలీసు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతూ సిబ్బందిని నిరంతరం అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ప్రజలకు, రాజకీయ పార్టీలకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే పోలీస్‌ వారికి తక్షణం సమాచారం అందించాలని, నిరంతరం జిల్లా పోలీసులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ కమీషనర్‌తో పాటు, జాయింట్‌ కలెక్టర్‌ పి.సంపత్‌ కుమార్‌, డి.సి.పి.లు కె.శ్రీనివాసరావు, ఏ.బి.టి.ఎస్‌. ఉదయరాణి, కె.చక్రవర్తి, టి.హరికృష్ణ, ఏ.డి.సి.పిలు ఏ.సి.పి.లు, ఇతర పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️