శంకుస్థాపనతో సరి

May 3,2024 22:15

ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : మత్స్సకారుల జీవితాల్లో మార్పులు తీసుకొస్తామని చెప్పిన నాటి టిడిపి ప్రభుత్వం ఆచరణలో మాట నిలబెట్టుకోలేదు. చింతపల్లి తీరంలో ఫ్లోటింగ్‌ జెట్టీ నిర్మించి ఉద్దరిస్తామన్న వైసిపి ప్రభుత్వం కేవలం శంకుస్థాపనకు పరిమితమైంది. దీంతో, మత్స్యకారుల జీవితాలు ఎదుగు బోదుగూ లేకుండా పోతున్నాయి. జిల్లాలో సుమారు 21.44 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. సుమారు 4వేల మత్స్యకార కుటుంబాల్లో 20వేల జనాభా సముద్రంలో చేపలవేటే జీవనాధారంగా కాలం వెల్లదీస్తున్నాయి. జిల్లాలో గుర్తించిన 711 మోటరైజ్‌డ్‌ ఫిషింగ్‌ బోట్లు, 417 సంప్రదాయ పడవలు ఉన్నాయి. ఒక్క చింతపల్లి ప్రాంతంలోనే 487 మోటరైజ్‌డ్‌ ఫిషింగ్‌ క్రాప్ట్స్‌, 361 సంప్రదాయ పిషింగ్‌ బోట్లు ఉన్నాయి. చింతపల్లితో పాటు చుట్టుపక్కల ప్రాంతంలోని తిప్పలవలస, మద్దూరు, కొత్తూరు, బర్రిపేట, నీలగెడ్డపేట, తమ్మయ్యపాలెం, పులిగెడ్డపాలెం, పతివాడ బర్రిపేట తదితర చోట్ల 16 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు ఉన్నాయి. సముద్ర తీరం నుంచి కెరటాలను దాటుకొని సముద్రంలోకి ప్రవేశించడం అత్యంత ప్రమాదకరమైన ప్రక్రియ. ఈ సమయం లోనే ఎక్కువమంది మత్స్యకారులు ప్రమాద వశాత్తూ ప్రాణాలు కోల్పోతుంటారు. దీనికి భయపడి చాలామంది మత్స్యకారులు తమ వృత్తిని వదిలిపెట్టడం లేదా, జెట్టీ ఉన్న ప్రాంతానికి వలస వెళ్లిపోవడం జరుగుతోంది. విజయనగరం జిల్లాలో చేపలవేటలో అత్యంత నైపుణ్యం ఉన్న మత్స్యకారులు ఉన్నారు. వీరి నైపుణ్యానికి గొప్ప గుర్తింపు ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలోకి వెళ్లినా, విజయనగరం జిల్లాకు చెందిన మత్స్యకారులు కనిపిస్తారు. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో పనిచేస్తున్న బోటు డ్రైవర్లలో సగం మంది విజయనగరం జిల్లాకు చెందినవారే కావడం గమనార్హం. ఈ సమస్య పరిష్కరించి మత్స్యకారులకు జరుగుతున్న నష్టాన్ని అరికట్టడంతోపాటు మత్స్య సంపద విక్రయించుకునేందుకు అవకాశం కల్పించాలని చాలా కాలంగా డిమాండ్‌ ఉంది. గతపాలకులు విస్మరించిన నేపథ్యంలో తాము పూసపాట ిరేగ మండలం చింతపల్లి తీరంలో సుమారు రూ.23.73కోట్ల అంచనాతో ఫ్లోటింగ్‌ జట్టీ నిర్మాణం చేపడతామని వైసిపి ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం చింతపల్లి తీరంలో 6వేల ఎకరాలు కేటాయించారు. సరిగ్గా ఏడాది క్రితం 2023మే 3న సిఎం జగన్మోహన్‌రెడ్డి ఫ్లోటింగ్‌ జట్టీ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. రాష్ట్రంలో పూడిమడక తరువాత, చింతపల్లే రెండోపెద్ద ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌గా ఉంటుందని, ఇక్కడ జెట్టీ నిర్మాణం వల్ల మత్స్యకారులు నిర్భయంగా సముద్రంలోకి వెళ్లే అవకాశం లభిస్తుందని, రాత్రీ పగలూ చేపల వేటకు వెళ్లొచ్చని, మత్స్యకారులు తాము వేటాడిన చేపలను సులువుగా ఒడ్డుకు చేర్చడానికి వీలు అవుతుందని, అప్పట్లో సిఎం జగన్‌తోపాటు వైసిపి నాయకులు కూడా అప్పట్లో తెగేసి ఊదరగొట్టారు. మేలైన మత్స్య ఉత్పత్తిచేయడానికి, జెట్టీతో మత్స్యకారుల పడవలకు రక్షణ లభిస్తుం దని, లంగరు వేసుకోవడం సులువుతుం దని కూడా చెప్పారు. చింతపల్లిలో జెట్టీ నిర్మాణం జరిగితే, పర్యాటక పరంగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ది చెందుతుని కూడా జనం ఆశించారు. ఈ జెట్టీ నిర్మాణం పూర్తయితే మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరగడమే కాకుండా, నాణ్యమైన మత్స్య ఉత్పత్తులు జిల్లా ప్రజలకు అందుబాటు లోకి వస్తాయి. పర్యాటక పరంగా కూడా చింతపల్లి ప్రాంతం అభివద్ది చెందుతుం దన్న ఆశాభావం మత్స్యకారుల్లో వ్యక్తమైంది. ఆచరణలో మాట నిలబెట్టుకోకపోవడంతో మత్స్యకారుల పరిస్థితి ఎప్పటిలానే మిగిలింది. దీంతో, టిడిపి మాదిరిగా వైసిపి ప్రభుత్వం కూడా ఆశపెట్టి మోసం చేసిందని జనం చర్చించు కుంటున్నారు. తీరం వైపు కన్నెత్తి కూడా చూడలేదు ఫ్లోటింగ్‌ జెట్టీ కడతామని చెప్పి సిఎం జగన్మోహన్‌ రెడ్డి ద్వారా ఆర్భాటంగా ప్రారంభోత్సవం చేసి వదిలేసారు. ఇప్పటికి వరకూ అధికారులు గాని, నాయకులు గాని తీరం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఫ్లోటింగ్‌ జెట్టి వస్తే మా మా బతుకులు బాగుపడతాయని అనుకున్నాం. ఇప్పటికొచ్చి ఒక్క రాయి కూడా వేయలేదు. కడతారని నమ్మకం కూడా లేదు.కొమర ఎల్లయ్య మత్స్యకారుడు, చింతపల్లి.మా ఓట్లే కావాలి ఈ ప్రభుత్వానికైనా, గత ప్రభుత్వానికైనా మా ఓట్లే కావాలి తప్ప మా బతుకులు బాగుపడేలా చేసే నాయకుడు ఒక్కడు కూడా లేడు. భోగాపురం, పూసపాటిరేగ తీరంలో 10వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వేట పై ఆధారపడిన వారు ఉన్నారు. జెట్టీ వస్తే మా అందరికీ ఉపయోగపడుతుంది. జెట్టీ లేక మా వేటకారులంతా వలస వెళ్లిపోతున్నారు. ఈ ఐదేళ్లూ అక్కడ కడతాం ఇక్కడ కడతామని నాన్చేసారు. జెట్టి సకాలంలో పూర్తి చేస్తామన్న నాయకుడి వైపే మా మత్స్యకారులు ఉంటారు. బర్రి పోలయ్య తిప్పలవలస, పూసపాటిరేగ మండలం.

➡️