సమావేశాలను విజయవంతం చేయాలి- వ్య.కా.స రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీనివాసులు

ప్రజాశక్తి-మదనపల్లి అంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈ నెల 23, 24 తేదీల్లో హార్సిలీహిల్స్‌లో నిర్వహిస్తారని, ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం పట్టణంలో వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య 1934లో స్థాపించిన వ్యవసాయ కార్మిక సంఘం నేడు కోటిమంది సభ్యులతో దేశవ్యాపితంగా విస్తరించి కష్టజీవుల పక్షాన నికరంగా పోరాడుతుందని వివరించారు. దేశంలో నేటికీ 65 శాతంపైగా ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే ఉద్దేశంతో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని, ఫలితంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దానిపై ఆధారపడి జీవిస్తున్న ప్రజల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని వాపోయారు. వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం, గ్రామీణ ప్రజల జీవితాల మెరుగుదల కోసం వ్యవసాయ కార్మిక సంఘం అనేక ఉద్యమాలు, పోరాటలు చేస్తోందని గుర్తుచేశారు. రాబోయే కాలంలో వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమాల రూపకల్పనకు హార్సిలీహిల్స్‌లో రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. సమావేశాల్లో అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, అఖిల భారత ఉపాధ్యక్షులు విక్రమ్‌ సింగ్‌, రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లుతో పాటు రాష్ట్ర కమిటీ సబ్యులు హాజరవుతున్నారని తెలిపారు. కరువు ప్రాంతంలో జరుగుతున్న కూలీ సంఘం రాష్ట్ర సమావేశాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

➡️