పల్లాకు టిడిపి రాష్ట్ర అధ్యక్ష పదవిపై హర్షం

ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు

నగరంలో పలుచోట్ల సంబరాలు

ప్రజాశక్తి -గాజువాక : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నియామకంపై గాజువాక పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ మేరకు అధినేత చంద్రబాబు ప్రకటించిన వెంటనే, శుక్రవారం పాతగాజువాక జంక్షన్లో బాణాసంచాకాల్చి, స్వీట్లు పంచి సందడి చేశారు.1968లో గాజువాకలో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పల్లా శ్రీనివాసరావు జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎంటెక్‌, ఎంబిఎలో ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణుడైన శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం విశాఖ-2 నియోజకవర్గంలో, ఎన్టీ రామారావు హయాంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. పల్లా శ్రీనివాసరావు, ఎంటెక్‌లో సివిల్‌ విభాగం కావడంతో, విశాఖ నగరంలో చాలా ప్రాజెక్టులకు ఉచితంగానే కన్సల్టేషన్‌ ఇచ్చేవారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరపున విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో శ్రీనివాసరావు కూడాకాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2014లో గాజువాక కాంగ్రెస్‌ అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ బిఫారం ఇచ్చినప్పటికీ, టిడిపి టిక్కెట్‌కు ప్రయత్నించి, సాధించి, గెలుపొందారు. అయితే 2019లో గాజువాకలో జనసేనాని పవన్‌కల్యాణ్‌ పోటీలో ఉండడంతో టిడిపి అభ్యర్థిగా పోటీచేసి, వైసిపి చేతిలో ఓటమి పాలయ్యారు.. తర్వాత విశాఖ జిల్లా టిడిపి అధ్యక్షుడుగా చంద్రబాబు నియమిస్తే, రాష్ట్రంలో టిడిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జిల్లాలో ఎలాంటి గ్రూపులకు ఆస్కారం లేకుండా అందరినీ సమన్వయం చేస్తూ పార్టీని సమర్థవంతంగా నడిపించారు. తాజాగా 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో టిడిపి ఎమ్మెల్యేగా పల్లా గెలుపొందారు. అందరూ మంత్రి పదవి వస్తుందని ఆశించినప్పటికీ, రాజకీయ, కుల, ప్రాంతీయ సమీకరణల నేపథ్యంలో అది నెరవేరనప్పటికీ, అధినేత చంద్రబాబుకు పల్లాపై ఉన్న నమ్మకం, భరోసాతో టిడిపి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. పల్లాకు తెలుగుదేశం రాష్ట్రపగ్గాలు దక్కడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ, మంత్రి పదవి వస్తే చాలా బాగుండేదని కొందరు కార్యకర్తలు, నాయకులు అభిప్రాయ పడుతున్నారు.

తూర్పులో టిడిపి శ్రేణుల సంబరాలు

ఎంవిపి కాలనీ: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా గాజువాక ఎమ్మెల్యే, విద్యావేత్త పల్లా శ్రీనివాసరావు నియామకంపై తూర్పు టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. తూర్పు కార్యాలయంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కేకు కట్‌ చేశారు. ఈ సందర్భంగా వెలగపూడి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసిన పల్లా శ్రీనివాస్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంపై హర్షం వ్యక్తం చేస్తూ, అధినేత చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జోన్‌ వన్‌ టిడిపి మీడియా కోఆర్డినేటర్‌ బైరెడ్డి పోతనరెడ్డి నాయకులు కాళ్ల శంకరు గొలగాని గోపాలరావు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.

➡️