ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే లక్ష్యం : పల్నాడు ఎస్పీ

Apr 5,2024 22:02

పల్నాడు జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్‌
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాలో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేటట్లు చూడడమే తమ లక్ష్యమని పల్నాడు జిల్లా నూతన ఎస్పీ జి.బిందుమాధవ్‌ అన్నారు. గురువారమే బాధ్యతలు చేపట్టిన ఆయన జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ స్వేచ్ఛాయుత, పారదర్శక, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తామన్నారు. నిబంధనలు తూచ తప్పకుండా పాటిస్తామని, పోలీసు శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎవరైనా దాడులకు, చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా బిందుమాధవ్‌ గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ఎస్‌ఇబి జాయింట్‌ డైరెక్టర్‌గా, పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్‌)గానూ పని చేశారు. అనంతరం ప్రమోషన్‌పై గ్రేహౌండ్స్‌ ఎస్పీగా వెళ్లి మళ్లీ పల్నాడు ఎస్పీగా నియమితులయ్యారు.

➡️