అభివృద్ధికి ఆమడ దూరాన పార్కులు

May 24,2024 21:43

ప్రజాశక్తి -పార్వతీపురం టౌన్‌ : పట్టణం జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెంది 70 వేల జనాభాకు చేరుకున్నప్పటికీ పట్టణ ప్రజలు సేద తీర్చుకునేందుకు సరిపడా పార్కులు లేవనే చెప్పవచ్చు, బెలగాం చర్చి వీధిలో మున్సిపాలిటీ ఏర్పడిన తొలి రోజుల్లోనే డాక్టర్‌ సన్యాసిరాజు మున్సిపల్‌ పార్క్‌ను మాత్రమే అభివృద్ధి చేశారు. ఆ తర్వాత మున్సిపల్‌ పరిధిలో కొత్తగా ఏర్పడిన పార్కులను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టడం లేదు. ఇక జిల్లా కేంద్రంగా ఆవిర్భవించి రెండేళ్లు పూర్తి అయినప్పటికీ పట్టణ ప్రజలు ఆహ్లాదానికి దూరంగా ఉన్నారనే చెప్పొచ్చు. పట్టణంలో పాత బస్టాండ్‌ దగ్గరలో ఉన్న ఎస్‌ఎన్‌ఎం నగర్‌లో ఉన్న మున్సిపల్‌ పార్క్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌ వెనుక ఉన్న మున్సిపల్‌ పార్క్‌, బెలగాంలోని నారాయణ స్కూల్‌కు వెళ్లేదారిలో ఉన్న మున్సిపల్‌ పార్క్‌లు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. 2006లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత పాత బస్టాండ్‌ దగ్గర ఉన్న ఎస్‌ఎన్‌ఎంనగర్‌ పేరుతో కొందరు వ్యాపారులు మున్సిపల్‌ అప్రూల్‌తో లేఅవుట్‌ను వేసి పార్క్‌ స్థలాన్ని చూపించారు. దీంతో ఈ పార్కు స్థలానికి అప్పటి రాష్ట్ర, పర్యావరణ, చిన్న నీటి పారుదల శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, అప్పటి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నరసింహ ప్రియా థాట్రాజ్‌తో కలిసి రూ.5లక్షలు జన్మభూమి నిధులతో 2006 మే 29న ప్రారంభోత్సవం చేశారు. అయితే ఈ పార్కులు ప్రారంభించి నేటికీ 18ఏళ్లు అయినా అభివృద్ధికి నోచుకోలేదు. ప్రభుత్వాలు, పాలకవర్గాలు పట్టించుకోకపోవడంతో ఈ పార్కు పశువులకు అడ్డాగా మారింది. అలాగే గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ వెనుక భాగంలో ఉన్న మున్సిపల్‌ పార్కింగ్‌ స్థలానికి నీరు చెట్టు పథకం కింద కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి మట్టి వేయించారు. కానీ పార్కును అభివృద్ధి చేయలేదు. అనంతరం వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్‌ కమిషనర్‌ కనకమహాలక్ష్మి ఆధ్వర్యంలో నారాయణ స్కూల్‌ దగ్గరలో ఉన్న మున్సిపల్‌ పార్క్‌లో మట్టితో నింపినప్పటికీ పార్కును అభివృద్ధి చేయలేదు. ఈ పార్కులను అభివృద్ధి చేసేందుకు పాలకవర్గ కౌన్సిల్‌ సభ్యులతో పాటు మున్సిపల్‌ అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేసి పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని సమకూర్చేలా తమ వంతు కృషి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

➡️