ఉపాధి బకాయిలు చెల్లించాలి

Jul 2,2024 21:07

ప్రజాశక్తి – మక్కువ : ఉపాధి కూలీలకు బకాయిలు చెల్లించాలని, రెండు పూటలా పని రద్దు చేయాలని, ఏడాదికి 200 రోజులు పని కల్పించాలని, రూ.400 కూలి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక మండలపరిషత్‌ కార్యాలయం వద్ద వేతనదారులు మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు, గిరిజన సంఘం జిల్లా నాయకులు టి.ప్రభాకర్‌ మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు చేసిన 14 రోజుల్లో బిల్లులు చేయాలని చట్టంలో వున్నప్పటికీ గత 5 వారాల నుంచి బిల్లులు చేయలేదని, 7 నెలల నుంచి వ్యవసాయ పనుల్లేక, ఇటు ఉపాధి బిల్లులు కాక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఎన్నికల ముందు బిల్లులు చేసినట్లు ఎన్నికలు అయిన తర్వాత బిల్లులు చేయడం లేదని అన్నారు. అలాగే వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగుతున్న కొద్దీ వ్యవసాయ పనిదినాలు తగ్గిపోతున్నాయని అన్నారు, అందుకని ప్రభుత్వం 200 రోజులు పని దినాలు పెంచి, రూ.400 కూలి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మెడికల్‌ కిట్లు, టెంట్లు, మంచినీరు, మజ్జిగ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. పార, పలుగు, తట్టల నిర్వాహణ కోసం డబ్బులు వేయాలని అన్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు అడ్డమేశ్వరావు, వెంకటరావు, రమేష్‌, భాస్కరరావు పాల్గొన్నారు.

➡️