పోస్టల్‌ బ్యాలెట్‌కు పక్కా ఏర్పాట్లు

May 4,2024 21:24

ప్రజాశక్తి-విజయనగరం కోట :  జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. దీనికోసం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఫెసిలిటేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నాగలక్ష్మి శనివారం తనిఖీ చేశారు. ఓటింగ్‌ కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఆమె ముందుగా శృంగవరపుకోట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఏర్పాట్లపై ఆర్‌ఒ మురళీకృష్ణను ఆరా తీశారు. పోస్టల్‌ ఓటింగ్‌ కోసం పక్కగా ఏర్పాట్లు చేయాలని, వేగంగా ఓటింగ్‌ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అనంతరం విజయనగరం జెఎన్‌టియు గురజాడ విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన రెండు ఫెసిలిటేషన్‌ సెంటర్లను సందర్శించారు. హెల్ప్‌ డెస్క్‌ లను ఏర్పాటు చేసి, ఓటు వేయడానికి వచ్చే ఉద్యోగులకు అవసరమైన సమాచారాన్ని, సహాయ సహకారాలను అందించాలని ఆదేశించారు. ప్రతీ చోటా తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్లు తదితర కనీస మౌలిక సదుపాయాలు ఉండాలని సూచించారు. ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎక్కడా ఇబ్బంది పడకూడదని స్పష్టం చేశారు. ఎక్కువసేపు క్యూలైన్లలో వేచి ఉండకుండా, వేగంగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. వేచి ఉండటానికి సరిపడా షామియానాను, కుర్చీలను ఏర్పాటు చేయాలన్నారు. విజయనగరం రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, డిఆర్‌ఒ ఎస్‌.డి.అనిత, డిఆర్‌డిఎ పీడీ ఎ.కళ్యాణ చక్రవర్తి, ఎస్‌సి కార్పొరేషన్‌ ఇడి సుధారాణి, ఎఆర్‌ఒలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

సిద్ధమవుతున్న ఇవిఎంలు

ప్రజాశక్తి-శృంగవరపుకోట/ విజయనగరం కోట

రానున్న ఎన్నికల్లో ఉపయోగించేందుకు నియోజకవర్గ కేంద్రాల్లో ఇవిఎంలు సిద్ధమవుతున్నాయి. ఆయా నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారుల ఆధ్వర్యంలో, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పటిష్ఠమైన భద్రత మధ్య ఈ ప్రక్రియ జోరుగా జరుగుతోంది. ఇవిఎంలను సిద్ధం చేయడంతోపాటు, వాటిలో గుర్తులను లోడ్‌ చేసే ప్రక్రియ కూడా నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి శనివారం పరిశీలించారు. ఎస్‌.కోట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, విజయనగరం పోలీసు శిక్షణా కళాశాలలను సందర్శించారు. ఈ రెండు చోట్లా ఇవిఎంలను సిద్ధం చేస్తున్న ప్రక్రియను పరిశీలించారు. గడువులోపల ప్రక్రియను పూర్తి చేయాలని ఆర్‌ఒలను ఆదేశించారు. విజయనగరంలో జాయింట్‌ కలెక్టర్‌, విజయనగరం రిటర్నింగ్‌ అధికారి కె.కార్తీక్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.మల్లయ్యనాయుడు, ఎస్‌.కోటలో ఆర్‌ఓ మురళీకృష్ణ, ఎఆర్‌ఒలు, డిటిలు, అభ్యర్థులు, వారి ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️