పార్కు కార్మికుల జీతాలు హాంఫట్‌..?

May 26,2024 19:53

ప్రజాశక్తి- బొబ్బిలి : పార్కు కార్మికుల మూడు నెలల జీతాలను కాంట్రాక్టర్‌ హాంఫట్‌ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పార్కు, యుద్ధ స్తంభం వద్ద ఉన్న గార్డెన్‌లో పిచ్చిమొక్కలు తొలగించి పరిసర ప్రాంతాలను శుభ్రం చేసేందుకు, కోటి చెరువు గట్టు, ఆర్‌టిసి కాంప్లెక్స్‌ నుంచి జ్యూట్‌ మిల్లు వరకు నాటిన మొక్కలకు నీరు పోసి మొక్కలను సంరక్షించేందుకు 16మంది కార్మికులను నియమించేందుకు కౌన్సిల్‌ తీర్మానం చేసింది. 2023 ఏప్రిల్‌ నుంచి 2024 మార్చి వరకు కార్మికుల సరఫరాకు పట్టణానికి చెందిన ఒక కాంట్రాక్టర్‌ టెండర్‌ దక్కించుకున్నారు. కార్మికులకు ప్రతినెల వేతనాలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ మున్సిపాలిటీ నుంచి బిల్లు వస్తేనే కాంట్రాక్టర్‌ కార్మికులకు వేతనాలు చెల్లిస్తున్నారు. దీంతో కార్మికులకు నెలల తరబడి వేతనాలు అందడం లేదు. కాగా మున్సిపల్‌ అధికారులు గత ఎనిమిది నెలల వేతనాలకు సంబంధించిన బిల్లులు చెల్లిస్తే ఐదు నెలల వేతనం చెల్లించి మూడు నెలల వేతనం సెలవులు కింద కట్‌ చేసి కాంట్రాక్టర్‌ హాంఫట్‌ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మూడు నెలల వేతనాలు ఇవ్వకపోవడంతో ఎవరికి చెప్పాలో తెలియక కార్మికులు సతమతమవుతున్నారు.మూడు నెలల జీతాలు సెలవులకు కట్‌ చేసిన కాంట్రాక్టర్‌పార్కు కార్మికుల మూడు నెలల జీతాలు సెలవులు కింద కాంట్రాక్టర్‌ కట్‌ చేసి హాంఫట్‌ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 12 నెలల జీతాలు 12మంది కార్మికులకు చెల్లించాల్సి ఉండగా మున్సిపల్‌ అధికారులు ఎనిమిది నెలల జీతాలు బిల్లు కాంట్రాక్టర్‌ కు చెల్లించారు. మూడు నెలల జీతాలను సెలవులు కింద కాంట్రాక్టర్‌ కట్‌ చేసుకుని పూర్తిగా ఇవ్వలేదని పేరు చెప్పేందుకు భయపడుతున్న కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇస్తున్న అరకొర వేతనంలో మూడు నెలల జీతాలు సెలవులు కింద కట్‌ చేస్తే తాము కుటుంబాన్ని ఎలా పోషించాలని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్‌ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కార్మికులు కోరుతున్నారు.16మంది కార్మికులకు 12మందితో పనులుపార్కు, యుద్ధం స్తంభం గార్డెన్‌, కోటి చెరువు గట్టుపై మొక్కలు, ఆర్‌టిసి కాంప్లెక్స్‌ నుంచి జ్యూట్‌ మిల్లు వరకు రోడ్డు డివైడర్‌ మొక్కలను సంరక్షించి నీరు పోసేందుకు 16మంది కార్మికులతో పనులు చేసి సూపర్‌ వైజర్‌కు రోజుకు రూ.600, మగ కార్మికునికి రోజుకు రూ.350, మహిళా కార్మికునికి రోజుకు రూ.200 చెల్లించేందుకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. 16మంది కార్మికులకు ఆమోదం తెలిపితే 12మంది కార్మికులతో పనులు చేసి 16మంది వేతనాలు బిల్లు చేసుకుని మున్సిపల్‌ నిధులను స్వాహా చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. 16మందిలో ఒక సూపర్‌ వైజర్‌, ముగ్గురు మగ కార్మికులు, 12మంది మహిళా కార్మికులు పని చేయాల్సి ఉండగా ఒక సూపర్‌ వైజర్‌, ముగ్గురు మగ కార్మికులు, ఎనిమిది మంది మహిళా కార్మికులు మాత్రమే పని చేస్తున్నారు. నలుగురు మహిళా కార్మికులు పని చేయకుండానే పని చేస్తున్నట్లు రికార్డులో నమోదు చేసి మున్సిపల్‌ నిధులను స్వాహా చేస్తున్నట్లు తెలుస్తుంది. అక్రమాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.సెలవుల వేతనం స్వాహాప్రతిరోజు 16మంది కార్మికులతో పని చేపించాలి. అత్యవసర పనుల కోసం ఒక కార్మికుడు సెలవు పెడితే ఆ కార్మికుడు స్థానంలో మరో వ్యక్తిని పెట్టుకుని పని చేపించి బిల్లు పెట్టాల్సి ఉన్న మరో కార్మికుడుని పెట్టకుండా బిల్లు పెట్టుకుని మున్సిపల్‌ నిధులను స్వాహా చేస్తున్నారు. పార్కు కార్మికుల వేతనాల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వేతనాలు చెల్లింపుపై దర్యాప్తుపార్కు కార్మికుల వేతనాలు చెల్లింపుపై సమగ్ర దర్యాప్తు చేస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ ఎల్‌.రామలక్ష్మి చెప్పారు. పార్కు కార్మికులకు ప్రతినెల వేతనాలు చెల్లించాల్సిన బాధ్యత కాంట్రాక్టర్‌ పై ఉందన్నారు. మూడు నెలల వేతనాలు సెలవులు కింద కట్‌ చేసినట్లు తమ దృష్టికి రాలేదని, దర్యాప్తు చేసి కార్మికులకు న్యాయం చేస్తామన్నారు. మున్సిపల్‌ బిల్లు ఆలస్యమైనా కార్మికులకు సకాలంలో కాంట్రాక్టర్‌ వేతనాలు ఇవ్వాలన్నారు.

➡️