మున్సిపల్‌ స్థలాన్ని కాపాడండి: సిపిఎం

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌: పట్టణ నడిబొడ్డున అన్న క్యాంటీన్‌ పక్కన గల సర్వే నెంబర్‌ 494/బి4లోని మున్సిపల్‌ స్థలాన్ని పట్టణానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఆక్రమించుకొని, అక్రమ నిర్మాణాలు చేసిన విషయం తెలిసిందే. వెంటనే ఈ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాన్ని తొలగించి మున్సిపల్‌ స్థలాన్ని కాపాడాలని కోరుతూ సోమవారం సిపిఎం నాయకులు మార్కాపురం మున్సిపల్‌ కమిషనర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు సోమయ్య మాట్లాడుతూ సదరు స్థలం పూర్తిగా మున్సిపల్‌ బెటర్మెంట్‌ అవసరాల కోసం మార్కాపురం హౌసింగ్‌ క్రిస్టియన్‌ వెల్ఫేర్‌ సొసైటీ వారు కేటాయించారని, ఆ స్థలంలో అన్న క్యాంటీన్‌, సచివాలయం కూడా ఉన్నాయని తెలిపారు. ఇటువంటి స్థలాన్ని పట్టణానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఒకరు అక్రమంగా ఆక్రమించుకుని తప్పుడు దస్త్రాలను పుట్టించి రిజిస్టర్‌ చేయించుకున్నారని, అందులో రూములు కూడా నిర్మించుకొని ప్రతి నెలా డబ్బులు వసూలు చేసుకుంటూ ఆదాయ వనరుగా మార్చుకున్నాడని అన్నారు. అయినా మున్సిపల్‌ అధికారులు తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరించడం దారుణమని అన్నారు. కేవలం కబ్జాదారుడితో లాలూచీపడి మౌనంగా ఉన్నారని, వెంటనే సదరు స్థలాన్ని కాపాడాలని మున్సిపల్‌ కమిషనర్‌కు విన్నవించారు. స్పందించిన మున్సిపల్‌ కమిషనర్‌ కిరణ్‌ వెంటనే విచారణ చేపట్టి తమ వద్ద ఉన్న దస్త్రాలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు డికెఎం రఫీ, గుమ్మ బాలనాగయ్య, పందిటి రూబెన్‌, కాశయ్య, విజరు, నాగరాజు, పి మల్లికార్జున, వందన కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️