నగర పోలీసు కమిషనర్‌గా శంఖబ్రాత బాగ్చి బాధ్యతల స్వీకరణ

Visakha Police commissioner duty joining

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : విశాఖ సిటీ నూతన పోలీస్‌ కమిషనర్‌గా డాక్టర్‌ శంఖబ్రాత బాగ్చి సోమవారం ఉదయం నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, జాతీయ వైద్యుల దినోత్సవం రోజు బాధ్యతలు చేపట్టడం ఒక వైద్యునిగా చాలా సంతోషంగా ఉందన్నారు. విశాఖతో చాలా ఏళ్ళ నుంచి తనకు మంచి అనుబంధం ఉందని, విధుల రీత్యా పలు మార్లు విశాఖ వచ్చినట్లు తెలిపారు. విశాఖ మహా నగరంలో ఉన్న సమస్యలపై అవగాహన ఉందన్నారు. డ్రగ్స్‌ అండ్‌ నార్కోటిక్స్‌ ప్రథమ సమస్య అని, వాటిని రూపుమాపడం తన మొదటి ప్రాథాన్యత అని చెప్పారు. ఎవరైనా పోలీస్‌ స్టేషన్‌కు వస్తే మర్యాదగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీసు సిబ్బందికి సంక్షేమం అందేటట్లు చూస్తానని తెలిపారు. నగర ప్రజలకు ఏదైనా ఇబ్బంది, ఏదైనా సమస్య ఉన్నా, సమాచారం ఇవ్వాలన్నా, ఏదైనా అన్యాయం జరిగినా 7995095799 నెంబరును సంప్రదించాలని చెప్పారు.

➡️