సాఫీగా పింఛన్ల పంపిణీ

Jul 2,2024 00:36 #Pensions distribution
Pensions distribution

ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి అనకాపల్లి జిల్లాలో ఎన్‌టిఆర్‌ భరోసా పథం కింద 2,64,033 మంది పింఛన్‌దారుల్లో 2,45,740 మందికి (93.09 శాతం) గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పింఛన్‌ సొమ్ము అందజేశారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటలు దాటే వరకు పింఛన్‌ సొమ్ము పంపిణీచేశారు. కొత్త ప్రభుత్వం పెంచిన పింఛన్‌ సొమ్ము ఇంటికి వెళ్లి ఇవ్వడం మొదటిసారి కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఎస్‌.రాయవరం మండలం, పెదగుమ్మలూరులో పలువురికి పింఛన్లు పంపిణీ చేశారు. కలెక్టర్‌ రవి పట్టాన్‌శెట్టి అనకాపల్లి పట్టణంలోని మిరియాల కాలనీ సచివాలయం, సబ్బవరం మండలం గొటివాడ సచివాలయంలో జరిగిన పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. పింఛన్‌దారులకు విడుదలైన రూ.174.67 కోట్లలో రూ.162.60 కోట్లు అందజేశారు. జిల్లాలో ఎస్‌.రాయవరం మండలం మినహా మిగిలిన 23 మండలాలు సహా యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాల్టీ, అనకాపల్లి పట్టణంలో 90 శాతానికి పైగా పింఛన్‌ సొమ్ము పంపిణీచేశారు. అత్యధికంగా కె.కోటపాడు మండలంలో 11,002 మంది లబ్ధిదారులకు విడుదలైన రూ.7.10 కోట్లలో రూ.6.91 కోట్లు (97.38 శాతం) అందించారు. ఎస్‌.రాయవరం మండలంలో 87.27 శాతం పంపిణీ జరిగింది. డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్‌ శచీదేవి, డిఎల్‌డిఒ మంజులవాణి, పెన్షన్‌ డిపిఎం వెంకటరమణ, ఎపిడి డైజి పింఛన్‌ సొమ్ము పంపిణీ పర్యవేక్షించారు. మంగళవారం మిగిలిన వారికి అందించి పింఛన్‌ సొమ్ము పంపిణీ కార్యక్రమం పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు.

➡️