క్రీడా శిక్షణకు విశేష స్పందన

May 26,2024 21:08

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న వేసవి శిక్షణ శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. విజయనగరంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో వేసవి శిక్షణ శిబిరాలను ఈ నెల 15 నుంచి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నిర్వహిస్తోంది. విజయనగరంలోని రాజీవ్‌ క్రీడా ప్రాంగణంలో బాక్సింగ్‌, విజ్జి స్టేడియంలో స్కేటింగ్‌, తైక్వాండో, రాజీవ్‌ ఇండోర్‌ స్టేడియంలో బ్యాడ్మింటన్‌, కొండవెలగాడలో వెయిట్‌ లిఫ్టింగ్‌ శిక్షణ ఇస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో శిక్షణ శిబిరాలకు విద్యార్థులు, క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. వీరికి ముందుగా అరగంటపాటు ఫిట్నెస్‌ కోసం వ్యాయామాలు చేయించడం, అనంతరం ఆయా క్రీడల్లో వారికి శిక్షణ ఇస్తున్నారు. బాక్సింగ్‌ శిబిరానికి సుమారుగా 50 మందికి పైగా హాజరవుతున్నారు. రోజురోజుకూ ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుండటంతో విద్యార్థులను వారి తల్లిదండ్రులు క్రీడలకు ప్రోత్సహిస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు సెల్‌ఫోన్లకు బానిస కాకుండా ఉండేందుకు కూడా పిల్లలను వేసవి శిక్షణ శిబిరాలకు పంపిస్తున్నారు. అనుభవజ్ఞులైన శిక్షకులు ఉండటంతో క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.శిక్షణకు ఆదరణఎన్నికల పోలింగ్‌ ఈ నెల 13న ముగియడంతో శిక్షణ శిబిరాలను 15వ తేదీ నుంచి ప్రారంభించాం. ప్రారంభం నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఇది చాలా ఆనందంగా ఉంది. ఐదు విభాగాల్లో కోచ్‌లు ఉండటంతో వారు ఫిట్నెస్‌, తర్వాత క్రీడలపై అవగాహన పెంచి అనంతరం వారిని మైదానాల్లో దించి ఆడిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. నాణ్యమైన క్రీడాకారులను తయారు చేసేందుకు, క్రీడలను ప్రోత్సహించేందుకు శిబిరాలు ఎంతో దోహదం పడుతున్నాయ. ఉన్న సమయాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి.- ఎస్‌.వెంకటేశ్వరరావు, డిఎస్‌డిఒ

➡️