అనంతను అభివృద్ధి చేశాం

హిందూపురంలో రెడ్‌బుక్‌ చూపిస్తూ మాట్లాడుతున్న నారా లోకేష్‌

          హిందూపురం : కరువుకు నిలయం అయిన అనంతపురం జిల్లాను టిడిపి పాలనలో అన్ని విధాలా అభివృద్ధి చేశామని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్‌ తెలియజేశారు. నారా లోకేష్‌ చేపట్టిన శంఖారావం 2వ విడత యాత్ర శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రారంభం అయ్యింది. గురువారం నాడు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం, మడకశిరలో బహిరంగ సభలు నిర్వహించారు. రాత్రి పుట్టపర్తి నియోజకవర్గంలో బస చేశారు. బహిరంగ సభల్లో నారా లోకేష్‌ మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి అనేక విధాలుగా ప్రోత్సాహం అందించామన్నారు. కరువు జిల్లాలో ఏకంగా కార్లు తయారుచేసే పరిశ్రమ తీసుకువచ్చిన విజనరీ నాయకుడు చంద్రబాబునాయుడు అన్నారు. కియా అనుబంధ సంస్థల ద్వారా 50 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఐదేళ్లలో 1.30 లక్షల మంది రైతులకు 90 శాతం సబ్సీడీ ద్వారా డ్రిప్‌ ఇరిగేషన్‌ను అందించి అనంతను హార్టికల్చర్‌ హబ్‌ గా తీర్చిదిద్దామన్నారు. ఒకే సంవత్సరంలో ఇన్‌పుట్‌ సబ్సీడీ ద్వారా రూ.2వేల కోట్లు రైతులకు అందిచామని తెలియజేశారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు ఫేజ్‌-2, హెచ్‌ఎల్‌సి హైలెవన్‌ మెయిన్‌ కెనాల్‌, మిడ్‌ పెన్నా సౌత్‌ కెనాల్‌, గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌, ధర్మవరం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు తెలుగుదేశం పార్టీ పాలనలోనే జరిగాయన్నారు. వైసిపి అధికారంలోకి రాగానే అనంత అభివృద్ధి ఆగిపోయిందన్నారు. అనంతపురం జీవనాడిగా ఉన్న డ్రిప్‌ ఇరిగేషన్‌ పథకాన్ని రద్దు చేసి రైతులను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కరువులోకి నెట్టేశాడన్నారు. కరువులో చిక్కుకుని రైతులు పంటల నష్టపోయినా కనీసం ఇన్‌ పుట్‌ సబ్సీడీ ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రికి చేతులు రావడం లేదని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో వైసిపి అరాచక పాలనను సాగిస్తోందన్నారు. ఎలాంటి విజన్‌ లేని వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గంజాయిలో, ఇసుక, మద్యంలో అక్రమాలకు పాల్పడుతూ డబ్బులను దోచుకోవడంలో ఆయనకు విజన్‌ ఉందన్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రంలో మూడు ముక్కలాట ఆడుతున్నారన్నారు. బాబారు వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు..? చంపించిందెవరు..? సూత్రధారులు, పాత్రధారులు ఎవరు..? అన్న వాటిపై ఇంతవరకు విచారించకపోవడంలో ముఖ్యమంత్రి ఆంతర్యం ఏమిటంటూ స్వయానా ఆయన చెల్లి సునీత సంధిస్తున్న ప్రశ్నలకు జగన్మోహన్‌రెడ్డి సమాధానాలు చెప్పాలన్నారు. జగన్మోహన్‌రెడ్డికి ఓటు వేయొద్దని ఆయన చెల్లెలు చెబుతోంది అంటే జగన్మోహన్‌రెడ్డి ఎలాంటి వారో అర్థం చేసుకోవాలన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే అనంతపురం జిల్లా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. హిందూపురాన్ని మోడల్‌ పట్టణంగా తీర్చిదిద్దుతామన్నారు. లేపాక్షిలో పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకువచ్చి స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని తెలియజేశారు. టీడీపీ-జనసేన మధ్య చిచ్చుపెట్టేందుకు వైసిపి పేటీఎం బ్యాచ్‌ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బాబు సూపర్‌ సిక్స్‌ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి టిడిపికి ఓటేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షులు బికె.పార్థసారధి, మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్న, టిడిపి అభ్యర్థి సునీల్‌కుమార్‌, ఎమ్మెల్సీ రాంభూపాల్‌ రెడ్డి, జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు టిసి.వరుణ్‌, నియోజక వర్గ ఇన్‌ఛార్జి ఆకుల ఉమేష్‌తో పాటు టిడిపి, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️