అర్జీలకు సత్వర పరిష్కారం

అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

         పుట్టపర్తి అర్బన్‌ : వివిధ సమస్యలపై స్పందన గ్రీవెన్స్‌లో ప్రజలు అందించే అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు పుట్టపర్తి కలెక్టరేట్‌లోని స్పందన సమావేశ మందిరంలో జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, డిఆర్‌ఒ కొండయ్యతో కలిసి జిల్లా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం స్పందన సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో మాట్లాడారు. స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను పరిశీలించి నిర్ణీత కాలంలో వాటికి పరిష్కారాలు చూపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలన్నారు. వాలంటీర్ల ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులు కులగణన ప్రక్రియను వేగవంతం చేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండల స్థాయి ప్రత్యేక అధికారులు ఆయా మండలాల్లో జరుగుతున్న సర్వేతో పాటు ప్రభుత్వ పథకాల అమలు లక్ష్యసాధనపై ప్రత్యేక దష్టి సారించాలన్నారు. ఇప్పటికి జిల్లాలో 85 శాతం సర్వే పూర్తయ్యిందని ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 2వ తేదీన వరకు ఆయా గ్రామ, వార్డు పరిధిలోని సచివాలయాల్లో ఏవైనా కారణాలవల్ల మిగిలిపోయిన కుటుంబాలు సర్వేకు సంబంధించిన వివరాలు నమోదు చేయాలన్నారు. ఫిబ్రవరి 2 నుంచి 15వ తేదీ వరకు కులగనన డేటాను పరిశీలించి జాబితా సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. గడపగడపకూ మన ప్రభుత్వం ద్వారా మంజూరైన పనులను అనుకున్న సమయంలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటర్ల తుది జాబితా తర్వాత మరికొంత అవకాశం ఇచ్చినప్పటికీ లోపాలు సరిదిద్దకపోవడం సరికాదన్నారు. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత అధికారులు స్పందించి ఎలాంటి తప్పుల్లేకుండా వారంలోగా పూర్తి స్థాయి జాబితాను తయారు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 6 ,7 ,8 క్లైమ్‌లను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, గ్రామ, వార్డు సచివాలయ నోడల్‌ అధికారి శివారెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️