అవినీతి ఆరోపణలతో ఎస్‌ఒపై బదిలీ వేటు

Feb 15,2024 21:18

విద్యార్థినులతో మాట్లాడుతున్న డిఇఒ

తన బదిలీ ఆపేందుకు ఎస్‌ఒ ఎత్తుగడలు

విద్యార్థినులను రెచ్చగొట్టి ఆందోళనకు ప్రేరేపణ

స్టాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన డిఇఒ

చిలమత్తూరు : చిలమత్తూరు కేజీబీవి అవినీతి ఆరోపణలకు కేరాఫ్‌గా నిలిచింది. ఈ మేరకు ఉన్నతాధికారులు విచారణ నిర్వహించి ఎస్‌ఒ రిహానాపై బదిలీవేటు వేశారు. అయితే తన బదిలీని ఆపేందుకు ఎస్‌ఒ అనేక ఎత్తుగడలు వేశారు. ఇందులో భాగంగానే గురువారం ఉదయం కేజీబీవీలో హైడ్రామా మొదలైంది. తమకు ఎస్‌ఒ రిహానా కావాలని కోరుతూ విద్యార్థినులు కేజీబీవీకి తలుపులు వేసి ఆందోళన చేశారు. అయితే ఎస్‌ఒ ఎత్తుగడలు చివరకు చిత్తయ్యాయి. చిలమత్తూరు కెజిబివిలో ఉన్న ఓ విద్యార్థిని మూడు నెలల క్రితం నైల్‌ పాలీస్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.ఈ బాలిక ఇచ్చిన సమాచారం మేరకు విద్యాశాఖ అదికారులు, చైల్డ్‌ లైన్‌ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. కేజీబీవీలో కనీస వసతుల కల్పన, భోజనం వంటి వసతుల నిర్వహణలో ఎస్‌ఒ పూర్తిగా విఫలం అయిందని అవినీతికి పాల్పడిందని తెలుసుకున్నారు. దీంతో పాటు ఎస్‌ఒ గతంలోను అవినీతికి పాల్పడి సస్పెండ్‌ అయినా ఆమె ప్రవర్తనలో మార్పురాలేదని నిర్ధారణకు వచ్చారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలు ఉండటం గమనించారు. విద్యార్థినులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకున్నారు. పదేళ్లుగా ఇక్కడే స్థిరపడిన ఆమెకు ఎలాంటి బదిలీ లేక పోవడంతోనే అంతా తానై వ్యవహరిస్తున్నట్లు గ్రహించారు. ఈ మేరకు విచారణ అధికారులు పై అధికారులకు నివేదిక పంపారు. దీంతో ఆమెపై అధికారులు బదిలీ వేటు వేశారు. అందులో భాగంగా ఎన్పీకుంట కుంటకు బదిలీ చేసినట్లు తెలిసింది. అయితే ఈ సమయంలోనే ఎస్‌ఒ తన బదిలీని నిలుపుదల చేయించుకునేందుకు ఎత్తుగడ వేశారు. అందులో భాగంగా గురువారం కెజిబివిలో హై డ్రామాకు తెరలేపారు. ఈనెల 14న రాత్రి ఓయువకునితో కేజీబివి వద్ద కొంత మంది విద్యార్థినిలకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ స్లోగన్స్‌ వంటివి నేర్పించినట్లు సమాచారం. అంతేకాకుండాకొంత మంది ఉపాధ్యాయులు ఆమెకు మద్దతుగా నిలిచారు. విద్యార్థినులతో తమకు ఎస్‌ఒ రిహానానే కావాలని లెటర్లు కూడా రాయించారు. ఇలా పక్కా ప్లాన్‌ ప్రకారం అనుకున్న విధంగానే గురువారం ఉదయం స్థానిక కేజీబీవీకి తాళం వేసుకొని లోపటి నుండే విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. ఎస్‌ఐ గంగాధర్‌ వచ్చి సర్దిచెప్పిన వినకపోవడంతో ఆయన వెనుతిరిగారు. రంగంలోకి దిగిన డిఇఒ : విద్యార్థినుల ఆందోళన నేపధ్యంలో డీఈవో మీనాక్షీ కేజీబీవీని సందర్శించారు. విషయం తెలుకుని ఎస్‌ఒ నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ గతంలో చేసిన నిర్వాకం చాలక విద్యార్థులను రెచ్చగొట్టి మరింత రచ్చ చేస్తావా…? విద్యార్థినులు ఇచ్చిన పిర్యాదుల మేరకు బదిలీ చేశాం.రికమెండేషన్లు చేయిస్తూ కాలయాపన చేస్తావా…? పిబ్రవరి 8 న బదిలీ కావల్సి ఉన్నా ఇంత వరుకు ఎందుకు రిలీవ్‌ కాలేదు. ఎందుకు ఎన్పీ కుంట లో రిపోర్ట్‌ చేసుకోలేద’ని ఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అన్ని రికమండేషన్లు అయిపోయి చివరికి విద్యార్థినులను రెచ్చగొట్టి అందోళన చేయిస్తావా.. పదేళ్లు ఒకే చోట ఉంటూ చేసిన అవినీతి చాలాదా’ అని అన్నారు. అనంతరం డిఇఒ మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ రిలీవ్‌ అయి ఎన్పీ కుంటలో జాయిన్‌ కావాల్సిన ఎస్‌ఒ లీవ్‌ పెట్టకుండానే లీవ్‌ పెట్టానని సమాధానం చెబుతున్నారని అన్నారు. కేజీబీవీలో విద్యాబుద్దులు నేర్పాల్సిన ఎస్‌ఒ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఈ ఎస్‌ఒ విద్యార్థులకు సంబందించిన ఆహారపదార్థాలు అన్ని అమ్ముకోవడం తన షాపుకు తీసుకోవడం వంటి పనులు చేస్తుందని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇవన్నీ రుజువు కావడంతోనే మరో చోటకు కలెక్టర్‌ బదిలీ చేయల్సి వచ్చిందని అన్నారు. అయితే బదిలీని కూడా లెక్కచేయకుండా తిరస్కరిస్తూ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పుడు రిలీవ్‌ చేస్తున్నామని, ఇక నుంచి ఎన్సీకుంట ఎస్‌ఒగా ఉంటారని అన్నారు. ఇంకా ఓవర్‌ యాక్షన్‌ చేస్తే ఈమెను సస్పెండ్‌ చేయాల్సివస్తుందని అన్నారు. ఇక కేజీబీవీలో ఎలాంటి అవినీతి జరగకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎజిసిడిఒ మాధవి తదితరులు పాల్గొన్నారు.

➡️