ఆర్‌ఐ దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి

Feb 8,2024 21:33

నిరసన వ్యక్తం చేస్తున్న రెవెన్యూ ఉద్యోగులు

                  కొత్తచెరువు : కొత్తచెరువు ఆర్‌ఐ దుర్గేష్‌పై లోచర్ల సర్పంచి కుమారుడు నారాయణస్వామి చేసిన దాడిని పలువురు ఖండించారు. ఈసందర్భంగా అమరావతి ఉద్యోగుల సంఘం చైర్మన్‌ మైనుద్దీన్‌, ఏపీ ఆర్‌ ఎస్‌ ఏ జిల్లా అధ్యక్షురాలు స్వాతి, తహశీల్దార్‌ కళావతి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెవిన్యూ విధులు నిర్వర్తించాలంటే ఇబ్బందిపడే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. రాజకీయ నాయకుల దాడులు అధికమవుతున్నాయన్నారు. అలాంటి వారిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. ఆర్‌ఐ పై తీవ్ర పదజాలంతో దూషించిన నారాయణస్వామిని తక్షణమే అరెస్టు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్‌తో పాటు కలెక్టరేట్‌ ఉద్యోగులు మధు నాయక్‌, వీఆర్వోలు వేణుగోపాల్‌, నారాయణప్ప, ఓబులేసు ,చెన్నయ్య, సురేషు, తదితరులు పాల్గొన్నారు. పుట్టపర్తి రూరల్‌: కొత్తచెరువు ఆర్‌ఐ దుర్గేష్‌, వీఆర్వో చెన్నయ్యపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించి ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తే రెవెన్యూ డివిజనల్‌ అధికారి కార్యాలయ సిబ్బంది గురువారం నిరసన తెలిపారు. ఈ మేరకు వారు పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం ముందు భోజన విరామం అనంతరం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ డివిజనల్‌ సంఘం నాయకులు మాట్లాడుతూ లోచర్ల సర్పంచి కుమారుడు నారాయణస్వామి రెవెన్యూ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాక చేయి చేసుకోవడానికి ప్రయత్నించారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రోజురోజుకు అధికారుల పైన దాడులు పెరుగుతున్నాయని వీటిని నివారించకపోతే భవిష్యత్తులో రెవెన్యూ అధికారులకు భద్రత కరువు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశౄరు.ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటస్వామి, ఉదరు కుమార్‌, మనోజ్‌ కుమార్‌ రెడ్డి, మంజుల, నరసింహులు, డిటిలు, డిఐలు, శేఖర్‌ చంద్రశేఖర్‌, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొత్తచెరువు : ఆర్‌ఐ దుర్గేష్‌ పై దాడి చేసిన లోచర్ల సర్పంచ్‌ గంగులమ్మ కుమారుడు వైసీపీ నాయకుడు నారాయణస్వామిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని టిడిపి వడ్డెర సాధికారిక సమితి జిల్లా కన్వీనర్‌ పల్లపు రవీంద్ర, నియోజకవర్గం కన్వీనర్‌ వలిపి శ్రీనివాసులు, చంద్రమోహన్‌, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్‌ పల్లపు మహేంద్ర తీవ్రంగా ఖండించారు శ్రీవిద్య కళాశాల ఆవరణంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బుధవారం సచివాలయంలో రిజిస్ట్రేషన్‌ కోసం వెళ్లిన ఆర్‌ఐ దుర్గేష్‌ పై తీవ్ర పదజాలంతో దూషించి దాడికి పాల్పడ్డారన్నారు ఇలాంటి సంఘటనలకు పాల్పడితే అధికారులు విధులు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. తక్షణమే నిందితుడిని అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటరమణప్ప, వెంకటనారాయణ, ఆలకుంట పెద్దన్న, శంకర్‌, అనిల్‌, ప్రసాదు, కిష్టప్ప, వెంకటేశు, నాగరాజు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఓబుల దేవర చెరువు : కొత్తచెరువు ఆర్‌ఐ దుర్గేష్‌, విఆర్‌ఒ చెన్నయ్య పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ఉద్యోగులు కోరారు. ఈ మేరకు వారు గురువారం తహశీల్దార్‌ కార్యాయలయం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్‌ జాకీర్‌, ఆర్‌ఐ నాగేంద్ర వీఆర్వోలు, విఆర్‌ఎలు పాల్గొన్నారు. పుట్టపర్తి అర్బన్‌ : కొత్తచెరువు మండలం లోచర్ల గ్రామంలో ఆర్‌ ఐ దుర్గేశ్‌ను దుర్భాషలాడిని వైసిపి నాయకుడు నారాయణస్వామిని వెంటనే అరెస్టు చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌ ముందు ఉద్యోగ సంఘాల నాయకుడు, డిప్యూటీ తాసిల్దార్‌ మైముద్దీన్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్‌ కు వినతి పత్రం సమర్పించారు.

➡️