ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి

Jan 29,2024 22:01

సమ్మెలో పాల్గొన్న సెర్ప్‌ ఉద్యోగులు

                            పుట్టపర్తి రూరల్‌ : జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిఆర్‌డిఎ, వైఎస్‌ఆర్‌ క్రాంతి పథకం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సెర్ప్‌ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల నిరవధిక సమ్మెలో భాగంగా సోమవారం మూడో రోజు డిఆర్‌డిఎకార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ నిరవధిక నిరాహార దీక్షలో ఎపిఎం ముత్యాలప్ప, లక్ష్మీనారాయణ, హేమలత, సీసీలు సుగుణ, చౌడయ్య కూర్చున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐకెపి ఉద్యోగులకు హామీ ఇచ్చారన్నారు. తాము అధికారంలోకి రాగానే రెగ్యులర్‌ చేస్తామని వారి సమస్యలు తీర్చుతామని అసెంబ్లీ సాక్షిగా మాటిచ్చారని గుర్తు చేశారు. ఆ మాటలు నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలు పరిష్కరిస్తారని నాలుగున్నర సంవత్సరాల పాటు ఎదురు చూశామని తప్పనిసరి పరిస్థితుల్లో నిరవధిక సమ్మెకు పూనుకున్నామని చెప్పారు. సమస్యలు పరిష్కరించేంతవరకు సమ్మె విరమించబోమని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో జరుగుతున్న స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌ అరుణ బాబుకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిధిలోని గుడిబండ దేవరాజ్‌, రామాంజినప్ప ,అశ్వ తప్ప, సుధాకర, శివమ్మ, సుజాత, రామాంజనేయులు, జేఏసీ కన్వీనర్‌ రామేశ్వర్‌ రెడ్డి, రామమోహన్‌, సీసీలు శంకర్‌, రవి, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️